తెలంగాణ

రేవంత్ కు విషెష్ చెప్పని రాహుల్.. గాంధీభవన్‌లో గుసగుసలు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి పుట్టినరోజు జరుపుకుంటుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు హంగామా చేశారు. పోటీపడి మరీ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఇక రేవంత్ రెడ్డి అనుచురులు, అభిమానుల హంగామా మరో లెవల్లో ఉంది.

సీఎం రేవంత్ రెడ్డికి పార్టీలకు అతీతంగా నేతలు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు రేవంత్ రెడ్డికి విషెష్ చెబుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా రేవంత్ కు శుభాకాంక్షలు చెప్పారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాక్షలు చెప్పలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

సీఎం రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీ కొంతకాలంగా కోపంగా ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.3 నెలలుగా ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రులను కలుస్తున్నారు కాని రాహుల్ గాంధీని కలవడం లేదు. దీంతో రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే టాక్ వస్తోంది.రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రుణమాఫీ సభలకు సీఎం రేవంత్ రెడ్డి పిలిచినా రాహుల్ గాంధీ రాలేదంటున్నారు. ఇటీవల కులగణన సమావేశానికి వచ్చినా.. అది దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగానే జరిగిందంటున్నారు.

బోయినపల్లి సభకు వచ్చిన రాహుల్ గాంధీ.. సందడ్లో సడేమియాలో రేవంత్ తో మాట్లాడారే తప్ప.. ప్రత్యేకంగా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ రాహుల్ గాంధీ ఆగ్రహానికి కారణం అంటూ కాంగెస్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ సోదరుల దందాల విషయంపైనా రాహుల్ కు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయని అంటున్నారు. బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి సఖ్యతగా ఉండటం కూడా రాహుల్ కు నచ్చడం లేదని.. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రిని దూరం పెడుతున్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో సాగుతోంది.

 

Back to top button