అంతర్జాతీయం

ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ మృతి!

Israel-Iran Conflict: ఇజ్రాయెల్-ఇరాన్ వార్ తో పశ్చిమాసియా భగ్గున మండుతోంది. ఇజ్రాయెల్ టెహ్రాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తోంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’  పేరుతో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులను మరింత తీవ్రతరం చేసింది. వరుసగా ఐదో రోజు కూడా దాడి, ప్రతిదాడులతో ఇరు దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ సైన్యంలోని కీలక కమాండర్లు చనిపోయగా, తాజాగా మరో టాప్ కమాండర్ దుర్మరణం చెందాడు.

ఖమేనే సన్నిహితులు హతం

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌ అత్యున్నత సైనిక కమాండర్‌, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన అలీ షాద్మానీ చనిపోయాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది.  మంగళవారం తెల్లవారుజామున  మిడిల్ టెహ్రాన్‌ లోని కమాండ్‌ సెంటర్‌ పై తాము జరిపిన దాడుల్లో అలీ షాద్మానీ చనిపోయినట్లు వెల్లడించింది. షాద్మానీ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌, ఇరాన్‌ సాయుధ దళాలకు సుప్రీం లీడర్ గా వ్యవహరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

శుక్రవారం నుంచి కొనసాగుతున్న దాడులు

ఇరాన్ మీద శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’ పేరుతో అణు శుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌ పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాక్‌ తో 1980లో జరిగిన  యుద్ధం తర్వాత తిరిగి ఆస్థాయిలో  దాడులను ఎదుర్కొంటోంది ఇరాన్‌. ఈ దాడుల్లో ఇరాన్‌ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్‌ మొహమ్మద్‌ బాఘేరి, రెవెల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ, ఖండాంతర క్షిపణి విభాగం అధికారి జనరల్‌ అమీర్‌ అలీ హాజీజాదే, పలువురు అణు శాస్త్రవేత్తలు, ఇరా‌న్‌ సాయుధ దళాల జనరల్స్ ఘోలంరేజా మెహ్రాబీ, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జనరల్ మెహదీ రబ్బానీ చనిపోయారు.

బంకర్ లో సేఫ్ గా ఉన్న ఖమేనీ

ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్  సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఆయన కుటుంబ టెహ్రాన్‌ ఈశాన్య ప్రాంతంలోని ఓ బంకర్‌లో సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. యురేనియం శుద్ధి ప్రక్రియను పూర్తిగా నిలిపివేసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది.

Read Also: ఇరాన్ టీవీపై ఇజ్రాయెల్ దాడి.. లైవ్ నుంచి లగెత్తిన యాంకర్!

Back to top button