
క్రైమ్ మిర్రర్, త్రిపురారం:- నూతన సంవత్సరాన్ని ఆర్భాటంగా జరుపుకోవడం కన్నా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలోని బుడిగ బజార్‌కు చెందిన శ్రీ కనకదుర్గా యూత్ సభ్యులు ఆదర్శప్రాయమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అవంతిపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ చెవిటి–మూగ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు నూతన సంవత్సరం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, విద్యాలయ అవసరాల కోసం కుర్చీలు, టేబుల్స్ అందజేశారు.డిసెంబర్ ముప్పై ఒకటి, జనవరి ఒకటి తేదీల్లో సాధారణంగా జరిగే వేడుకలను పూర్తిగా విరమించుకుని, వాటికి అయ్యే ఖర్చును ఒకచోట చేర్చి సేవాభావంతో ముందుకు వచ్చిన కనకదుర్గా యూత్ యువకులు విలువైన కుర్చీలు, ఇతర అవసర సామగ్రిని తమవంతు సహాయంగా అందించారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని చెవిటి–మూగ విద్యార్థులకు ప్రేమతో అన్నదానం నిర్వహించగా, మాటలతో భావాలు వ్యక్తం చేయలేని ఆ చిన్నారుల ముఖాల్లో కనిపించిన ఆనందం అందరి మనసులను హత్తుకుంది. వారి చిరునవ్వులే ఈ సేవా కార్యక్రమానికి నిజమైన సార్థకతను అందించాయి. వేడుకల అసలైన అర్థం సేవలోనే ఉందని నిరూపిస్తూ, తమ ఊరి నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రేరణ కలిగించేలా కనకదుర్గా యూత్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో గ్రామాల నుంచి జరగాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని చూసిన స్థానికులు, విద్యాలయ సిబ్బంది కనకదుర్గా యూత్ యువకుల సేవాభావాన్ని ప్రశంసిస్తూ, నేటి యువతకు వారు నిజమైన మార్గదర్శకులని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో బుడిగ వినోద్, బుడిగ సంతోష్, బుడిగ నవీన్, చాగంటి శ్రీనివాస్, గుండెబోయిన శ్రీను (భాష), బుడిగ నాగయ్య, బొల్ల హరీష్, గుండెబోయిన చరణ్, చాగంటి సైదులు, తండోజు మహేష్, బోల సైదులు, మకరబోయిన మధు, కనసాని కిరణ్, బొల్ల పవన్, తలకపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు…


Read also : ఏమాత్రం తగ్గని అనసూయ… రెచ్చగొట్టే ప్రయత్నమా?
Read also : సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!





