- బానిసవుతున్న యువతరం
- అంతరాష్ట్ర వంతెన వద్ద నిఘా కరువు
మహాదేవ్ పూర్, క్రైమ్ మిర్రర్ : గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. పట్టణాల్లోనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మత్తు పాకుతోంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు యువత దీనికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.
కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్ర నుంచి వివిధ మార్గాల్లో తెలంగాణ లోని మహాదేవ్ పూర్ కి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని పాన్ షాపులు, హోటళ్లు, క్లాత్ స్టోర్స్, ఆటోల అడ్డాల వద్ద గంజాయి విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయి. సిగరెట్లు, పాన్ మసాలా వంటి వివిధ రూపాల్లో సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. యువత సిగరెట్లలోని తంబాకును తొలగించి గంజాయి నింపుతూ తాగుతున్నారు.
మహాదేవ్ పూర్ మండలంలోని బొమ్మాపూర్ గ్రామంలో రాత్రి వేళల్లో పాఠశాల ప్రాంతాలు, చెరువు గట్లు, పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో తాగుతున్నారు అని సమాచారం. కొంత మంది విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే గంజాయిని సరదా కోసం తాగి క్రమంగా బానిసలవుతున్నారు. తరవాత వారి ప్రవర్తనలో మార్పు కనిపించి జరిగిన విషయం తెలుసుకొని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విక్రయదారులు కొందరు విద్యార్థులు, యువతనే లక్ష్యంగా చేసుకొని దందాను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.