
దేశంలో మహిళల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారుల గౌరవం వంటి అంశాలపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపే షాకింగ్ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన సోనాలి సింగ్ అనే మహిళ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నివసిస్తోంది. 31 ఏళ్ల వయసున్న ఆమె.. కేఆర్ పురం రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా జరిగిన పరిణామాలు చివరకు ఆమె అరెస్టు, జ్యుడీషియల్ కస్టడీ వరకు వెళ్లడం సంచలనంగా మారింది.
Bengaluru Shocker! Woman arrested for assaulting home guard after being advised to wear proper clothes. pic.twitter.com/UBmbYVhdAt
— The Tatva (@thetatvaindia) January 13, 2026
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రోడ్డుపై నడుస్తున్న సమయంలో కొంతమంది యువకులు సోనాలి సింగ్ దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను గమనించిన అక్కడే విధుల్లో ఉన్న మహిళా హోంగార్డు లక్ష్మీనరసమ్మ వెంటనే స్పందించారు. యువకులను గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి పంపించివేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఆ సమయంలో ఉద్రిక్తత కొంత మేరకు తగ్గినట్టుగా కనిపించింది.
అయితే యువకులను పంపిన అనంతరం మహిళా హోంగార్డు చేసిన ఓ వ్యాఖ్యే ఈ ఘటనను మరో మలుపు తిప్పింది. రోడ్డుపైకి వచ్చినప్పుడు నిండుగా బట్టలు ధరించి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వవు కదా అంటూ ఆమె సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ మాటలను వ్యక్తిగత స్వేచ్ఛపై జోక్యంగా భావించిన సోనాలి సింగ్ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైంది. హోంగార్డుతో వాగ్వాదానికి దిగిన ఆమె, నేను ఏం వేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ గట్టిగా కేకలు వేసింది.
కోపాన్ని నియంత్రించుకోలేకపోయిన సోనాలి సింగ్.. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డుపై దాడికి దిగింది. ఆమె చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా చెంప దెబ్బలు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మహిళా పోలీస్ విధుల్లో ఉందన్న విషయాన్ని కూడా పక్కనపెట్టి, అందరి ముందే అసభ్య పదజాలంతో దూషించిందని పోలీసులు పేర్కొన్నారు. చివరకు రోడ్డుపైనే హోంగార్డును జుట్టుపట్టుకుని లాగుతూ రక్తస్రావం అయ్యేలా దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు.
ఈ దృశ్యాలను చూసిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని హోంగార్డును ఆ మహిళ నుంచి కాపాడారు. అనంతరం మహిళా హోంగార్డు లక్ష్మీనరసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించిన పోలీసులు సోనాలి సింగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను అక్కడున్న కొంతమంది స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డుపై బహిరంగంగా దాడి చేసిన దృశ్యాలు చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ వీడియోలపై నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. మహిళా సాధికారత అంటే అధికారులపై చేయి చేసుకోవడం కాదని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మహిళలకు దుస్తుల విషయంలో స్వేచ్ఛ ఉండాలి అనుకునేవారు కూడా ఎదుటివారి గౌరవం, విధి నిర్వహణను గౌరవించాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..?





