ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ వీడారు – కూటమిలో కలవలేకపోతున్నారు- రెంటికీ చెడ్డ రేవడిలా…!

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:-రాజకీయాలు అంటే అధికారం, ఆధిపత్యం, పదవులు మాత్రమే అని అనుకుంటున్నారు కొంత మంది నేతలు. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ వాలిపోతుంటారు. ఈ గూటి పక్షి.. ఆ గూటిలో వాలినట్టు. అయితే… అది అన్నీ సార్లు వర్కౌట్‌ కాదు. కొన్ని సార్లు బొమ్మ తిరగబడుతుంది. వైసీపీ నుంచి కూటమిలోకి జంప్‌ అయిన.. మాజీ మంత్రుల పరిస్థితిలా…? అదేంటి…? వారికి ఏమైంది…? బాగానే ఉన్నారుగా అనుకోవచ్చు. కానీ… కడుపు చించుకుంటే కాళ్ల మీదే కదా పడుతుంది. ఇప్పుడు వాళ్ల పరిస్థితి కూడా అంతే. మింగలేరు-కక్కలేరు.. ఉండలేరు-వెళ్లలేరు. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది ఆ నేతల పరిస్థితి. ఇంతకీ ఎవరా మాజీ మంత్రులు…?
వైసీపీ నుంచి కూటమిలోకి వెళ్లి.. అక్కడ ఇమలేకపోతున్న చిన్నాచితకా నేతలు చాలా మందే ఉన్నా. మచ్చుకి ముగ్గురు మాజీ మంత్రుల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు… వారు ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు… ఉసూరుమంటున్నారు. వారిలో ఒకరు… బాలినేని. ఈయన వైఎస్‌ జగన్‌కు బంధువు… వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించారు. తన నియోజకవర్గంలో తన మాటే ఫైనల్‌ అన్నట్టు ఉండేది. ఆ తర్వాత.. నెమ్మదిగా వ్యవహారం మారిందిలే గానీ… ముందు మాత్రం.. ఆయనకు పార్టీలో ప్రాధన్యత ఉండేది. ఎన్నికల ముందు జగన్‌పై తిరుగుబావుటా ఎగరేసి.. వైసీపీ ఓటమి తర్వాత జనసేనలోకి జంప్‌ అయ్యారు బాలినేని. ఆ పార్టీలోకి వెళ్లి కొన్ని నెలలు దాటింది.. కానీ ఎక్కడ పెద్దగా కనిపించింది లేదు. మచ్చుకు ఒకటి, రెండు సార్లు అలా అలా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అంతేకాదు… జనసేనలో కూడా ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదట. జనసేనతో పాటు కూటమి పార్టీలోని టీడీపీ, బీజేపీ నేతలు కూడా బాలినేనితో కలవలేకపోతున్నారట. అందుకే ఇప్పటి వరకు ఆయన ఎలాంటి పదవి గానీ, బాధ్యతలు గాని అప్పగించలేదు. దీంతో.. బాలినేని ఏం చేయాలో అర్థం గాని పరిస్థితిలో తన వర్గాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారట.

ఇక.. ఆళ్లనాని. ఈయనది కాపు సామాజికవర్గం. వైసీపీ హయాంలో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల్లో వైసీపీ ఇలా ఓడిపోయిందో లేదో… అలా కూటమితో జతకట్టేశారు ఆళ్ల నాని. టీడీపీలో చేరనైతే చేరారు గానీ.. తెలుగుదేశం నేతలు మాత్రం ఆయన్ను పక్కకు కూడా రానివ్వడంలేదట. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆళ్లనానికి ఆహ్వానం లేకుండా పోయింది. కనీసం టీడీపీ ఆఫీసు దగ్గరకు కూడా ఆళ్ల నాని వెళ్లలేని పరిస్థితి. దీంతో.. ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇంత మాత్రానికి వైసీపీ వీడి టీడీపీ చేరాల్సి అవసరం ఏమొచ్చిందని.. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తల నుంచి ఆయనపై ఒత్తడి పెరుగుతోందట. ఎంత ఒత్తిడి పెరిగినా ఏం చేయగలరు. కష్టకాలంలో వైసీపీని వీడి… టీడీపీలోకి జంప్‌ అయిన ఆయన్ను.. మళ్లీ జగన్ రానివ్వడు. కూటమిలోనే ఉండిపోతే… తగిన ప్రాధాన్యం ఉండదు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఆళ్లనానిది.

మోపిదేవి వెంకటరమణది కూడా ఇదే పరిస్థితి. వైఎస్‌ జగన్‌ ఆయనకు మంచి అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకు కూడా పంపారు. అవన్నీ సరిపోలేదేమో… వైసీపీ ఓడిపోగానే.. అధికారంలో ఉన్న కూటమిలో చేరిపోయారు మోపిదేవి. చేరనైతే చేరారు గానీ.. ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. పదవుల కోసం కూటమిలోని మూడు పార్టీల నేతలే కొట్టుకుంటూ ఉంటే… వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఎందుకు దక్కనిస్తారు. ఆ మాత్రం ఆలోచించలేకపోయారు… ఆ మాజీ మంత్రులు. వైసీపీ ఓటమి తర్వాత వెళ్లిన వీరి పరిస్థితి ఇలా ఉంటే…. ఎన్నికల ముందు జంప్‌ అయిన వారి పరిస్థితి కాస్త బెటర్‌ అనే చెప్పాలంటే. ఎందుకంటే… కొందరికి మంత్రి పదవులు దక్కాయి. అయితే.. చేతిలో మినిస్టర్‌ పోస్ట్‌ ఉన్నా… అధికారాలు మాత్రం అంతంతమాత్రమనే చెప్పాలి. ఎందుకంటే… కూటమి నేతలు వారిని తమలో ఒకరిగా చూసే పరిస్థితి లేదు. దీంతో.. ముక్కకంచెలపై ఉన్నట్టు పదవులపై కూర్చుకున్నారు.

వైసీపీ నుంచి వెళ్లి మాజీ మంత్రులు మాత్రం కూటమి ప్రభుత్వంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీలో నెగ్గుకురాలేక… వెనక్కి తిరిగి రాకలేక సతమతమవుతున్నారు. మరి వీరి రాజకీయ భవిష్యత్‌ ఏంటి…? కూటమి అధికారంలో ఉంది కనుక… అధికార పార్టీలో ఉన్నామని చెప్పుకుని తిరిగేస్తారా…? మరి వచ్చే ఐదేళ్లు..? మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందా..? వచ్చినా వీరికి ప్రాధాన్యం ఇస్తుందా…? అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button