రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే బంగారం ధర రూ.1.50 లక్షలను దాటి, త్వరలోనే రూ.2 లక్షల మార్క్‌ను తాకే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలతో పాటు బంగారంపై నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ ఘటనలు, అర్ధరాత్రి జువెలరీ దుకాణాల్లో చోరీలు, ఆయుధాలతో బెదిరించి దోపిడీలు వంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక విచిత్ర దొంగతనం ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య జిల్లా రుదౌలీ పట్టణంలో ఉన్న అగర్వాల్ కాంప్లెక్స్ ప్రాంతం జువెలరీ దుకాణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బురఖా ధరించి సాధారణ కస్టమర్‌లా ఒక మహిళ జువెలరీ దుకాణంలోకి ప్రవేశించింది. దుకాణ యజమానితో సాధారణంగా మాట్లాడుతున్నట్లే ప్రవర్తించిన ఆమె, 26 గ్రాముల బంగారు హారం చూపించాలని కోరింది. యజమాని కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఆ హారాన్ని బయటకు తీసి చూపించారు.
అయితే క్షణాల్లోనే పరిస్థితి మారిపోయింది. యజమాని చేతిలో ఉన్న హారాన్ని ఒక్కసారిగా లాగేసుకున్న ఆ మహిళ, వెంటనే అతను ప్రతిఘటించడానికి ప్రయత్నించగానే గన్ తీసి అతనిపై గురిపెట్టింది. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో బెదిరించడంతో యజమాని షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత ఎటువంటి ఆత్రుత లేకుండా ఆ మహిళ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం దుకాణంలోని కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రుదౌలీ పోలీసులు, నిందితురాలి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సంఘటనతో స్థానిక వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నేరాలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తూ, జువెలరీ దుకాణాల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: వారి హయాంలో నాశనం.. మా హయాంలో శాసనం
