
ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు NDA కూటమిగా ఏర్పడ్డాయి. అనుకున్న ఫలితం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధికారం పంచుకుంటున్నాయి. అయితే.. ఏపీ ఫార్ములా… తెలంగాణలో వర్కౌట్ అవుతుందా…? అంటే డౌటే. అయితే ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది…? ఎవరికి వచ్చింది..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని ప్రతిపక్షాలన్నీ కోడై కూస్తున్నాయి. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలోనూ అధికార పార్టీకి పరాభవం తప్పలేదు. దీంతో… ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ కాకపోతే ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు..? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీని చూస్తున్నారు. అంటే…? బీఆర్‌ఎస్ అని చెప్పక తప్పదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సొంతంగా తన సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేలో కూడా బీఆర్‌ఎస్‌కే జైకొట్టారు ప్రజలు. మరోవైపు.. బీజేపీ కూడా తామేమీ తక్కువ కాదు అంటోంది. ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించామని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పట్టభద్రులు, ఉపాధ్యాయులు కూడా తమ వైపే ఉన్నారని రుజువైందని చెప్తోంది. ఎన్ని చెప్పినా… బీజేపీ సింగిల్‌గా తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశం ఉందా అంటే…? అనుమానమే. ఈ పరిస్థితిల్లో.. కాంగ్రెస్‌పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత.. గులాబీ పార్టీకి ప్లస్‌గా మారుతోంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీఆర్‌ఎస్‌దే అధికారమని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా నొక్కి చెప్తున్నారు. ఈ పరిస్థితి ఓ వర్గం వారికి మింగుడు పడటం లేదు. దీంతో… ఏపీ తరహాలో.. తెలంగాణలో కూడా బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి NDA కూటమిగా ఏర్పడితే ఎలా ఉంటుంది..? అన్న చర్చ పెడుతున్నారు.
మరి, ఏపీ ఫార్మలా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా..? చాలా కష్టమనే చెప్పాలి. ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్.. తెలంగాణ నినాదంతోనే అధికారంలోకి వచ్చింది. ఆంధ్ర పాలకుల ఆధిపత్యం పోవాలని.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాలని పోరాడింది. ప్రత్యేక రాష్ట్రం సాధించింది.. పదేళ్లు అధికారంలో ఉండింది బీఆర్‌ఎస్. ప్రభుత్వంపై వ్యతిరేకత… నిరుద్యోగుల పట్ల చూపిన నిర్లక్ష్యం.. ఉద్యమకారులను పట్టించుకోకపోవడం… ఇలా కొన్ని పొరపాట్ల వల్ల ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధికారానికి దూరమైంది. అయితే ఇప్పటికీ తెలంగాణ వాసుల్లో యాంటీ ఆంధ్ర నినాదం ఉంది. అలాంటప్పుడు… ఏపీ పార్టీలైన టీడీపీ, జనసేనతో బీజేపీ జతకడితే… లాభం ఉంటుందా..? లాభం మాట ఏమో గానీ.. నష్టమే ఎక్కువ జరుగుతుంది. తెలంగాణలో టీడీపీ, జనసేనతో బీజేపీ జతకడితే.. ముస్లిం ఓటు బ్యాంకు మొత్తం గులాబీ పార్టీ వైపు వెళ్తుంది. అదే జరిగితే… బీఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుంది.
2024 ఎన్నికల సమయంలో ఏపీలో NDA కూటమి ఏర్పడిన తర్వాత.. తెలంగాణలోనూ పొత్తు టాపిక్ వచ్చింది. అయితే.. బీజేపీలోని చాలా మంది నేతలు అందుకు ఒప్పుకోలేదు. దీంతో… బీజేపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లింది. ఇప్పుడు కూడా… తెలంగాణలో NDA కూటమి ఏర్పాటుకు… బీజేపీలోని ఓ వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. కనుక… తెలంగాణలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడటం కష్టమే..? అసలు ఆ ఆలోచనే అనవసరం. ఒకవేళ ఏ కారణంతో అయినా ఆ ఆలోచన చేస్తే.. అసలుకే చేటు తప్పుదు. పైగా బీఆర్‌ఎస్ గెలుపునకు సులభమైన మార్గం చూపించినట్టు అవుతుందన్నది విశ్లేషకుల మాట.