
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? పక్క రాష్ట్రంలోనూ పాగా వేయాలని చూస్తున్నారా..? అందుకు తగ్గట్టే అడుగులు వేస్తున్నారా…? బనకచర్ల వివాదంతో తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ వార్ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావన తెలంగాణ రాజకీయాల్లో పదే పదే వస్తోంది. ఇది టీడీపీకి ప్లస్ అవుతుందని కొందరు అంటున్నారు. ఇదంతా చంద్రబాబు చాణక్య రాజకీయం అనే వారు కూడా లేకపోలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి.. తెలంగాణలోనూ పోటీ చేయాలన్నది టీడీపీ అధినేత ఆలోచన అని… ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా..? అంటే ఏమో కావొచ్చు కూడా.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా… ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. పేరుతో కూటమి పాలనే అయినా… పవర్ మొత్తం చంద్రబాబు చేతుల్లోనే ఉంది. ఎందుకంటే.. కూటమిలో లీడ్‌లో ఉన్న పార్టీ టీడీపీనే. అందుకే చంద్రబాబు సీఎంగా కొనసాగుతున్నారు. అయితే.. ఆయన అక్కడి సరిపెట్టుకోరని.. తెలంగాణ రాజకీయాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో టీడీపీని బలపరిచి.. 2028 ఎన్నికల్లో పోటీచేయాలని చూస్తున్నారట చంద్రబాబు. అయితే.. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేం.
చంద్రబాబు ప్లాన్‌ను ముందే పసిగట్టిన తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు.. ఆయన్ను ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నాయని లోకల్ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు వస్తున్నారని వాళ్లలో భయం పట్టుకుందని.. అందుకే ప్రతి విషయంలో చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. వీని ఆరోపణలను నిజం చేసేలా ఉంది తెలంగాణ పార్టీల తీరు. ప్రతి టాపిక్‌లో చంద్రబాబును లాకడం.. ఆయన తెలంగాణకు శత్రువు అన్నట్టు మరోసారి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో… 2028 ఎన్నికల్లో విజయం తమదే అన్న ధీమాలో ఉన్నాయి. ఈ పరిస్థితి మళ్లీ చంద్రబాబు రాష్ట్రంలో రీఎంట్రీ ఇస్తే.. కూటమి పేరుతో బరిలోకి దిగితే… తమ పరిస్థితి ఏంటన్న గుబులు గులాబీ పార్టీలో మొదలైందని అంటున్నారు తెలంగాణ టీడీపీ నేతలు. అందుకే.. చంద్రబాబు వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని పదే పదే ఆరోపిస్తున్నారని మండిపడుతున్నారు. ఏదిఏమైనా… వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా కాకపోయినా… బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని.. ఇప్పటికే కథనాలు వచ్చాయి.