
ఢిల్లీలోని ఓ స్పాలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మసాజ్ కోసం స్పాకు వెళ్లిన ఓ మహిళ.. అక్కడ పనిచేస్తున్న పురుష సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. మసాజ్ సమయంలో తన టీషర్ట్‌లోకి మూడు నుంచి నాలుగు సార్లు చేయి పెట్టి అనుచితంగా తాకినట్లు ఆమె వెల్లడించింది. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, అది పూర్తిగా అసహ్యకరమైన అనుభవమని ఆమె పేర్కొంది.

ఈ విషయంపై తాను వెంటనే ఆ సిబ్బందిని ప్రశ్నించానని బాధిత మహిళ తెలిపారు. అప్పుడు అతడు క్షమాపణ చెబుతూ.. అనుకోకుండా తన చేయి అక్కడికి వెళ్లిందని చెప్పినట్లు ఆమె వివరించారు. అయితే ఇది అనుకోకుండా జరిగిన చర్య కాదని, ఉద్దేశపూర్వకంగానే తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపిస్తున్నారు. మహిళల భద్రతకు సంబంధించి ఇటువంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నిందితుడిగా పేర్కొనబడిన వ్యక్తి క్షమాపణ చెబుతున్న దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని అతడు బాధిత మహిళను కోరినట్లు సమాచారం. అయినప్పటికీ ఈ వీడియో బయటకు రావడంతో విషయం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. స్పాలు, వెల్నెస్ సెంటర్లలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రదేశాల్లోనే ఇటువంటి అనుభవాలు ఎదురవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్పా యాజమాన్యాలు సిబ్బంది నియామకం, శిక్షణ, పర్యవేక్షణ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మరోవైపు, బాధిత మహిళకు న్యాయం జరగాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: హాయిగా అనిపిస్తోందని చలికాలంలో పదే పదే వేడి నీటితో స్నానం చేస్తున్నారా? జాగ్రత్త





