తెలంగాణరాజకీయం

కవిత లేఖ లీక్ – బీఆర్ఎస్ లో ప్రకంపనలు

అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖను బయటపెట్టింది ఎవరు..? పార్టీ వర్గాల్లో అనుమానాల హోరు

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ కలకలం రేగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధినేత కేసీఆర్‌కు రాసినట్లు పేర్కొంటున్న ఆరు పేజీల లేఖ గురువారం సోషల్ మీడియాలో లీక్ కావడంతో పార్టీలో వర్గీయ చర్చలకు తెరలేపింది. ఈ లేఖ అసలైనదేనా..? కవితే రాశారా..? లేదంటే ఇది రాజకీయ వ్యూహాలకో భాగమా..? అనే అనుమానాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో విస్తరిస్తున్నాయి.

లేఖలో, ఇటీవల హనుమకొండలో జరిగిన రజతోత్సవ సభపై తీవ్ర సమీక్ష కనిపిస్తుంది. ముఖ్యంగా సభలో బీజేపీపై కేసీఆర్ తక్కువగా మాట్లాడిన విషయాన్ని ప్రశ్నిస్తూ, భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉండవచ్చన్న ఊహాగానాలకు తావిచ్చే అంశాలు పేర్కొన్నట్లు సమాచారం. అలాగే పాజిటివ్, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ రూపంలో పలు అంశాలపై కవిత అభిప్రాయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఈ లేఖపై ఇప్పటివరకు స్పందించకపోవడం, కవిత కార్యాలయం కూడా మౌనం పాటించడంతో, ఇది అంతర్గత అసంతృప్తికి నిదర్శనమా? లేక లీక్ చేయబడిన ప్రణాళికా పత్రమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పూర్తిస్థాయి పగ్గాల అప్పగింపుపై అంతర్గతంగా విభేదాలు ఉన్నట్లు గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. కవిత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని, తన వర్గీయులకు స్థానిక సంస్థల పదవులు ఇప్పించేందుకు ప్రయత్నించారని వర్గీయ నేతల వాదన. దీంతో రాష్ట్రస్థాయిలో ఆమె పాత్రకు గండిపడుతుందన్న ఆందోళనతోనే ఈ లేఖ రాసినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కవిత ఇటీవల లిక్కర్ స్కాంలో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెకు మద్దతుగా బీజేపీతో కేసీఆర్ చర్చలు జరిపారని వాదనలు వినిపించాయి. ప్రస్తుతం బీజేపీతో పొత్తు అంశంపై కూడా బీఆర్ఎస్ లో లోపలా చర్చలు సాగుతున్నాయన్న వాదనల నేపథ్యంలో, ఈ లేఖ బీజేపీపై ఒత్తిడి కలిగించేందుకు ఉద్దేశించిన చర్యగా ఉండవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ఇంతటి చర్చనీయాంశమైన లేఖపై బీఆర్ఎస్ నుంచి అధికారిక స్పందన లేకపోవడం మరింత అనుమానాలకు దారితీస్తోంది. వాస్తవానికి ఈ లేఖ రాసింది ఎవరు..? లీక్ చేసింది ఎవరు..? లీక్ చేయాలన్న ఉద్దేశం ఏంటి..? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబోవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button