
Nellore Aruna : అరుణ… నెల్లూరుకు చెందిన మహిళ. ఆమె ఒక లేడీడాన్ అని… నెల్లూరు నుంచి ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. అమరావతిలోని సెక్రటేరియట్‌లో అధికారులు పరుగుపెడతారంటూ వార్తలు వచ్చాయి. ఆమె వెనుక బడా రాజకీయనేతలు ఉన్నారంటూ ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. జీవితఖైదు అనుభవిస్తున్న రౌడీషీటర్ శ్రీకాంత్‌తో ఆమె ప్రేమాయణం గురించి కథలు కథలుగా స్టోరీలు వచ్చాయి. ఆస్పత్రిలో రొమాన్స్ వీడియోలు కూడా బయటికి వచ్చాయి. వ్యవహారమంతా రచ్చరచ్చ అయ్యింది… పెరోల్‌పై ఉన్న ప్రియుడు… జైలుకు తిరిగి వెళ్లకతప్పలేదు. దీంతో… ఒంటరి అయిన అరుణ.. తనకు ప్రాణభయం ఉందంటూ గగ్గోలు పెడుతోంది. అంతేకాదు… తన ప్రియుడ్ని వాడుకున్న వారి కష్టకాలంలో చేతులు దులుపుకున్నారని… పరిస్థితి చేయిదాటుతుంటే… తాను నోరు ఎందుకు విప్పకూడందంటూ పేలిపోయే పోస్టు పెట్టింది. దీంతో… అసలు ఆమె వెనకున్నది ఎవరు..? అన్న చర్చ మొదలైంది. పెద్దల అండ లేకుండా… ఆమె లాబీయింగ్ జరిగిందంటే ఎవరూ నమ్మరు..? ఎవరో వెనకుండే ఆమెను ఇప్పటి వరకు నడిపించారు. అయితే గట్టుగా ఉండాల్సిన ఈ గట్టంతా రట్టు కావడంతో… ఇప్పుడు ముఖం చాటేసినట్టు ఉన్నారు. ఇంతకీ ఎవరా పెద్దలు…? రాజకీయ నేతలేనా…? లేక పొలిటికల్‌గా పలుకుబడి ఉన్న పెద్దలా…?
శ్రీకాంత్.. రౌడీషీటర్. కరుడుగట్టిన నేరస్తుడు. ఓ కేసులో అతను జీవితఖైదు అనుభవిస్తున్నాయి. అయినా పెరోల్‌పై బయటకువచ్చాడు. ఆయన్ను పెరోల్‌పై రప్పించింది… ప్రేయసి అరుణ. శ్రీకాంత్‌కు పెరోల్ ఇచ్చేందుకు ముగ్గురు ఎస్పీలు ఒప్పుకోలేదు. అయినా.. శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చింది. దీనికి కారణం అరుణ. ఆమె వెనుకున్న వారు. అరుణ సాయంతోనే పెరోల్‌పై బయటకు వచ్చాడు శ్రీకాంత్. పోలీసు అధికారులు వద్దనా… అతన్ని బయటికి తీసుకొచ్చిందంటే.. అరుణ సామాన్యురాలు కాదని అందరికీ అర్థమవుతుంది. అవును.. నిజమే.. ఆమె సామాన్యురాలు కాదు… చిల్లర దొంగతనాల స్థాయి నుంచి లేడీ డాన్‌గా ఎదిగింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోనే ఏ పనైనా చిటికెలో చేయించుకుంటుంది. పోలీస్ స్టేషన్‌లో ఏ పని కావాలన్నా… ప్రభుత్వం ఆఫీసుల్లో ఏ ఫైల్ కదలాలన్నా… క్షణాల్లో చేయించేస్తుంది. నెల్లూరులో ఇంట్లో కూర్చుని ఒక్క ఫోన్ చేస్తే… అమరావతిలో సచివాలయం అధికారులు కూడా పరుగులు పెట్టాల్సిందే. ఆమె ఆ స్థాయిలో గడగడలాడిందట. ఈ స్థాయిలో ఉందంటే… అధికారులనూ పరుగులు పెట్టిస్తుందంటే.. ఆమె వెనుకున్న పవర్… మామూలు పవర్ అయ్యుండదు కదూ. అదే అందరి అనుమానం.
నెల్లూరు జిల్లాలో సామాన్యమైన కుటుంబంలో పుట్టింది అరుణ. మహిళా సమస్యలపై పోరాడుతున్నట్టు కలరింగ్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన దిశ యాప్‌ను తనకు అనుకూలంగా మలుచుకుంది. దిశ టీమ్‌లో చేరింది. పోలీసులతో పరిచయాలు పెంచుకుంది. దిశ ప్రొటెక్షన్ పేరుతో ఆర్గనైజేషన్ స్థాపించింది. దిశ పోలీస్‌స్టేషన్‌లో కూర్చొని సెటిల్‌మెంట్లు చేసిందని కూడా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలోని యంగ్ పొలిటీషియన్స్‌తో పరిచయాలు పెంచుకుంది. ఆమెతో స్నేహంగా ఉంటూ పనులు చేయించుకుంది. అంతా బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినా… గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిచింది. కానీ… ఎక్కడ చెడిందో ఏమో.. గానీ… ఇప్పుడు ఆమె కథ రివర్స్ అయ్యింది. బండారం మొత్తం బయటపడింది. దీంతో… ఆమె వెనకున్న పొలిటికల్ నేతలు కూడా వణికిపోతున్నారు. తమ పేర్లు ఎక్కడ బయటికి వస్తాయో అన్న ఆందోళనలో ఉన్నారు.
అరుణ ఎపిసోడ్ లవ్‌స్టోరీ కూడా ఉంది. రౌడీషీటర్ శ్రీకాంత్‌ను ప్రేమించానని అంటోంది అరుణ. మరో రౌడీషీటర్ జగదీష్‌తో గొడవలు ఉన్నాయని.. అతనే కావాలని తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్తోంది. తమ ఆస్పత్రి వీడియోలు తీసింది కూడా అతడే కావొచ్చని అంటోంది అరుణ. వీరి విషయం మీడియాకు ఎక్కి రాద్దాంతం కావడంతో… ప్రియుడి శ్రీకాంత్ పెరోల్ రద్దయింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. దీంతో.. అరుణ ఆటలు సాగడంలేదు. కష్టాలన్నీ చుట్టుముట్టడంతో.. అసహనం వెళ్లగక్కుతోంది అరుణ. శ్రీకాంత్ పెరోర్ రద్దుపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. శ్రీకాంత్‌ను వాడుకున్న వాళ్లు.. ఎప్పుడు నోరుమెదపడంలేదని… పరిస్థితి ఇక్కడి వరకు వచ్చాక నేను ఎందుకు నోరు విప్పకూడదు అంటూ ఆ పోస్టులో తెలిపింది. అంటే.. ఆమె నిజాలు బయటపెడతానని ఆమె బెదిరించింది. అయితే ఆ బెదిరింపులు ఎవరికి…? ఆమె చెప్తానంటున్న నిజాలేంటి…? వాస్తవాలు బయటకు వస్తే.. ఎవరికి కొంప మునుగుతుంది…? ఏమో చూద్దాం.