Supreme Court warns Telangana Speaker: 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ విచారణలో ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజువారీగా విచారించాలని, ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలని గత ఆదేశాల్లోనే ఇచ్చినట్లు గుర్తు చేసింది. తమ ఆదేశాలు పాటిస్తారో.. కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొంటారో స్పీకర్ తేల్చుకోవాలని సుప్రీకోర్టు తేల్చి చెప్పింది. అనర్హత అంశంపై నాలుగు వారాల్లో తేల్చాలన్నది. లేదంటే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకోవాలో నిర్ణయించుకోవాలని గట్టి వార్నింగ్ ఇచ్చింది.
మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశం
ఎమ్మెల్యేల అనర్హత అంశంపై వీలైనంత త్వరగా, లేదంటే మూడు నెలల్లో విచారించి నిర్ణయం తీసుకోవాలని జూలై 31 సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు విధించిన గడువు అక్టోబరు 31తో ముగిసింది. స్పీకర్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగా గడువులోగా విచారించడం సాధ్యం స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. మరో ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది.
రెండు పిటీషన్లపై సుప్రీం విచారణ
అటు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణలో స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. గడువు కోరుతూ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు బీఆర్‌ఎస్ రెండు పిటిషన్లు కలిపి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.





