
క్రైమ్ మిర్రర్, పటాన్ చెరు ప్రతినిధి :- ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా విస్మరించి ముందుగానే డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వంపై గుమ్మడిదల మండల రైతు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారా నగర్‌లో ప్రతిపాదించిన 152 ఎకరాల డంపింగ్ యార్డ్‌కు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 65వ రోజుకు చేరాయి.ఈ నిరసన కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి శ్యామ్ పిస్టింగ్ పరిశ్రమ ఉద్యోగులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ‘‘ఇది కేవలం గ్రామస్తుల సమస్య కాదని, సమీప ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే నిర్ణయం. ఈ అంశంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి అని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ ప్రజలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఎలాంటి ప్రజాభిప్రాయం స్వీకరించకుండా డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఇప్పుడు నిరసనలు ఊపందుకున్న తర్వాత ప్రజాభిప్రాయ స్వీకరణ చేపడతారా అని ప్రశ్నించారు? ఇది సరైన పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
అలాగే, ఇకనైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఈ ప్రాజెక్టును ఆపాలని అన్నారు. ప్రజల స్పష్టమైన వ్యతిరేకతను 15 రోజుల్లో వేల సంఖ్యలో డాక్యుమెంటెడ్‌గా సమర్పిస్తాము. ఉద్యమాన్ని మరింత తీవ్రంగా కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం,” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ అధ్యక్షులు చిమ్ముల జైపాల్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, నాయకులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, అభి శెట్టి రాజశేఖర్, మంద భాస్కర్ రెడ్డి, సూర్యనారాయణ, కరుణాకర్, ఉదయ్ కుమార్, పరిశ్రమ ఉద్యోగులు మండల రైతు జేఏసీ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.