తెలంగాణసినిమా

సినిమాటోగ్రఫీ శాఖలో ఏం జరుగుతోంది?

  • శాఖ మంత్రికి తెలియకుండానే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు

  • సినీ ఇండస్ట్రీని తాను పట్టించుకోవడంలేదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • ఒక్కో హీరో సినిమా విషయంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

  • ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు చివరిదాకా ఆటంకాలు.. ఓపెనింగ్ కలెక్షన్లపై ప్రభావం

  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’కు ఏ అడ్డంకీ లేకుండా ధరల పెంపునకు అనుమతి

Telangana : తెలుగు సినీ పరిశ్రమ విషయంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దల్లో విభేదాలు తలెత్తాయా? పరిశ్రమ ప్రముఖుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై ఏకాభిప్రాయం లేదా? అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు మొదటివారం టికెట్ ధరల పెంపు విషయంలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పుష్ప-2 సినిమా చూసేందుకు ఆ సినిమా హీరో అల్లు అర్జున్.. థియేటర్ కు వెళ్లిన సమయంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతోపాటు ఆమె కుమారుడు ఇప్పటికీ కోలుకోకపోవడం, దీంతో ఇకపై సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతించబోమని ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ తరువాత సినీ నిర్మాతలు కోర్టుకు వెళ్లి ధరల పెంపునకు అనుమతి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒకటి రెండు సినిమాల విషయంలో ఇలా జరగడంతో.. ప్రభుత్వం మళ్లీ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా నుంచి టికెట్ ధరల పెంపునకు తిరిగి అనుమతి ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇందుకు సుతరామూ ఇష్టపడటంలేదు. ధరల పెంపునకు అనుమతి ఇవ్వవద్దన్న నిర్ణయానికే ఆయన కట్టుబడి ఉన్నారు. అయినా.. మంత్రితో సంబంధం లేకుండానే ధరల పెంపు ఉత్తర్వులు ఆ శాఖ నుంచి వెలువడుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమాకు ధరల పెంపు సమయంలో మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై మంత్రి కోమటిరెడ్డిని ప్రశ్నించగా.. తాను అనుమతి ఇవ్వలేదని, అధికారులు తనకు తెలియకుండా ఇచ్చారని చెప్పారు. అయితే ఇటీవల విడుదలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా విషయంలో మాత్రం ఇది వివాదానికి దారితీసింది. ధరల పెంపుకోసం చిత్ర నిర్మాతలు కోర్టుకు వెళ్లగా.. ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చంటూ కోర్టు పేర్కొంది. అంతేకాదు.. ధరలు పెంచితే తప్పేంటనిన కూడా వ్యాఖ్యానించింది. సినిమా ఏమీ నిర్బంధం కాదని, టికెట్ ధర ఎక్కువ ఉందని భావించిన వారు.. వారం రోజులు ఆగి ఆ తరువాత సినిమా చూడవచ్చు కదా అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రీమియర్ షోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, తీరా ప్రీమియర్ షోలు ప్రారంభిద్దామనుకున్న సమయానికి ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో సినిమా విడుదలైన రోజు మార్నింగ్ షో దాకా ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాలేదు. ఆ తరువాత షోకి ఓపెన్ అయినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సాధారణంగా పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకు అయిన ఖర్చును రాబట్టుకునేందుకు నిర్మాతలు ఇలా టికెట్ రేట్ల పెంపును ఆశ్రయిస్తారు. తద్వారా ఆ సినిమాకు నెగెటిక్ టాక్ వచ్చినా.. ఒకటి రెండు రోజుల్లోనే సగంలో సగమైనా కలెక్షన్లు వస్తాయని భావిస్తారు. రాజాసాబ్ విషయంలో టికెట్ రేట్ల పెంపు విషయంలో నెలకొన్న సందిగ్ధంతో కలెక్షన్లపై భారీగా దెబ్బ పడింది. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో వచ్చే ఓపెనింగ్ కలెక్షన్లు కూడా రాకుండాపోయాయి. దీంతో నిర్మాత భారీగా నష్టపోయే పరిస్థితులు తలెత్తాయి. కానీ, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు వచ్చేసరికి మాత్రం అంతా సవ్యంగా సాగిపోయింది. టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి లభించింది. ఆ సినిమా యావరేజ్ గానే ఉందన్న టాక్ వచ్చినా.. ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద టికెట్ రేట్ల పెంపు అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.

మరో వివాదాస్పద అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా మంత్రిని సినిమాల గురించి ప్రశ్నించగా.. తాను సినిమా పరిశ్రమ గురించి పట్టించుకోవడంలేదని చెప్పారు. రేట్ల పెంపుకోసం తన వద్దకు రావద్దని ఎప్పుడో చెప్పానని, ఎవరే తన వద్దకు రావడంలేదని అన్నారు. కానీ, టికెట్ల రేట్లు ఎలా పెరుగుతున్నాయో, ఎవరు అనుమతిస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. దీంతో ఆ శాఖలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా అనుమతులు ఇస్తున్నారా? మంత్రితో సీఎంకు విభేదాలు తలెత్తాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button