PM Modi On Iran War: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ సంక్షోభం కరోనా మహమ్మారి తరహాలోనే దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పార్లమెంటులో మాట్లాడిన ఆయన, యుద్ధ ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, సాధారణ ప్రజల జీవన విధానంపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. భారత్ కూడా ఈ పరిణామాల వల్ల అసాధారణ సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.
సంక్షోభ నివారణకు ప్రత్యేక చర్యలు
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మోదీ చెప్పారు. మంత్రులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ఎగుమతులు-దిగుమతుల పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా యూరియా ధరలు భారీగా పెరిగినా, దేశీయంగా రైతులకు తక్కువ ధరకు అందిస్తున్నామని, ఇందుకోసం భారీ సబ్సిడీలు అందిస్తున్నామని చెప్పారు.
ఇంధనం విషయంలో ప్రభుత్వం అప్రమత్తం
మోదీ వెల్లడించారు. హోర్ముజ్ మార్గం ప్రభావంతో సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వివిధ దేశాల నుంచి ఇంధన దిగుమతులు పెంచుతూ, ప్రత్యామ్నాయ శక్తి వనరుల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు.
భారతీయుల భద్రతకు ప్రాధాన్యం
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఇప్పటికే లక్షలాది మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చామని, ఇంకా అవసరమైన వారికి సహాయం అందిస్తున్నామని తెలిపారు. యుద్ధ పరిస్థితుల్లో వదంతులను నమ్మకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
మొత్తంగా యుద్ధ సంక్షోభాన్ని దేశ ప్రజలందరూ ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. సహనం, జాగ్రత్తలతో ముందుకు సాగితేనే ఈ సవాళ్లను అధిగమించగలమని మోదీ స్పష్టం చేశారు.
