తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం నాడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. వేర్వేరు చోట్ల ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి.

తెలంగాణ వ్యాప్తంగా కుండపోత

ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.  సాయంత్రం వరకు 10.6 సెం.మీ.  వర్షపాతం నమోదైంది. తాంసి మండలంలో అత్యధికంగా 17.3 సెం.మీ. వర్షం కురిసింది. ఆదిలాబాద్‌లో పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 10 వేల ఎకరాల్లో పంటలు మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్‌, మంచిర్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోనూ భారీ వర్షం పడింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ఉత్పత్తికి ఆటకం ఏర్పడింది. ఇక మహబూబాబాద్‌ జిల్లా ఏడుబావుల జలపాతంలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం గ్రామానికి చెందిన ప్రేమ్‌ కుమార్‌గల్లంతయ్యాడు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం కన్నాపూర్‌కు చెందిన తిప్పారెడ్డి వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. కడెంప్రాజెక్టు దిగువన నీటిలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం రెడ్‌, సోమ, మంగళవారాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్‌, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Read Also: తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button