
రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ (శనివారం) అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అటు భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగామ, కరీంనగర్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదు
ఈ నెల 1 నుంచి 15 వరకు తెలంగాణ వ్యాప్తంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 15 రోజుల సాధారణ వర్షపాతం 106 మిల్లీమీటర్లే.. అంటే సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 15 వరకు సాధారణ వర్షపాతం 464 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 509 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీలో 19 వరకు వర్షాలు
అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో ఈ నెల 19 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య, దానిని అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశముంది. అటు తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఈ నెల 19వ తేది వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 50 కి.మీ ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.
Read Also: భారీ వర్షాలకు రాజధాని మునిగిందంటూ ప్రచారం.. స్పందించిన ప్రభుత్వం!