
Weather: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజులుగా కొనసాగుతున్న చలి పంజా సాధారణ జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉదయం, రాత్రి వేళల్లో గడ్డకట్టే చలితో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటు కామారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో చలి తీవ్రత మరింత ఎక్కువగా కనిపించింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, దాంతో చలి తీవ్రత తగ్గుముఖం పట్టిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
గత కొన్ని రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో 2, 3 రోజుల పాటు తీవ్రమైన చలి ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలికి సంబంధించి ప్రజలు కాస్త ఊరట పొందే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ రావు వెల్లడించారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం చలి తీవ్రత తగ్గినప్పటికీ, పూర్తిగా చలికాలం ముగిసినట్లు మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. ఉదయం, రాత్రి సమయాల్లో గ్రామాల్లో ప్రజలు చలిమంటలు కాచుకుంటూ చలిని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలి కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఉదయం వేళల్లో అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని చెబుతున్నారు. చలికాలంలో వేడి ఆహారం తీసుకోవడం, గోరువెచ్చని నీటిని తాగడం, శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించడం ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత కొంత తగ్గినా, పూర్తిగా జాగ్రత్తలు వదిలేయకూడదని వారు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా?





