
Rains Alert In Telangana: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం (జూలై 8) నాడు పలు జిల్లాల్లో వర్షాలు కురశాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. భారీగా ఈదురు గాలులు వీచాయి.
జులై 12 వరకు పలు జిల్లాల్లో వానలు
ఇక జూలై 9న రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూలై 10న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడతాయన్నారు. జూలై 12 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కురిసే సమయంలో బయటకు రాకపోవడం మంచిదన్నారు. ఉరుములు, పిడుగులుతో వానలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలన్నారు. రైతులు చెట్ల కింద ఉండకపోవడం మంచిదన్నారు.
Read Also: శ్రీశైలం గేట్లు ఓపెన్, సాగర్ లోకి కృష్ణమ్మ పరవళ్లు!