-
కాంగ్రెస్ ను కాదని గులాబీ పార్టీని టార్గెట్ చేయడం దేనికి సంకేతం
-
ముందుగా ప్రతిపక్షం, ఆ తరువాతే అధికారపక్షం
-
కొత్త ప్రణాళికతో కేసీఆర్ తనయ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కవిత గులాబీ పార్టీని ఎందుకు టార్గెట్ చేశారు? అధికార పార్టీని కాదని ప్రతిపక్షాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఆమె ఉద్దేశం ఏంటి? ఈ వ్యూహం వెనుక అసలు లక్ష్యం ఏంటి? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీని కాదని ఆమె గులాబీ పార్టీని టార్గెట్ చేస్తుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
మారిన కాంగ్రెస్ సీన్..
మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. పంచాయితీ ఎన్నికలతో కొంత ఊపు వచ్చింది. మున్సిపల్ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ పర్వాలేదనిపించింది. ఆపై కాంగ్రెస్ హై కమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తోక ముడిచింది. క్రమేపి సీఎం రేవంత్ రెడ్డికి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాల పర్వం కూడా కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. మరోసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇస్తారన్న టాక్ కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు వెళ్లడం కంటే.. గులాబీ పార్టీని నిర్వీర్యం చేస్తే తన పార్టీ బలోపేతం అవుతుందన్నది కవిత ఆలోచనగా తెలుస్తోంది.
-
కుటుంబ పార్టీగా ముద్ర..
గులాబీ పార్టీ ఓటమికి ప్రధాన కారణం కుటుంబ పార్టీగా ముద్ర. గత ఐదేళ్ల కెసిఆర్ పాలనలో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. సంక్షేమ పథకాలను సైతం అమలు చేశారు. కానీ కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు ఆ పార్టీని దెబ్బతీసాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం ఆ పార్టీని మరింత ప్రజల్లో బలహీనం పడేలా చేసింది. కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం.. కేటీఆర్ తో పాటు హరీష్ రావు మధ్య విభేదాల పర్వం నడుస్తుండడంతో ఆ పార్టీ క్యాడర్ అయోమయంలో ఉంది. అందుకే టిఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంటే ఆ పార్టీని క్రమేపి తాను హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అనేది కవిత ఆలోచనగా తెలుస్తోంది.
-
క్షేత్రస్థాయిలో క్యాడర్
గులాబీ పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉంది. బలమైన నాయకులు ఉన్నారు. కానీ వారంతా నిరుత్సాహంతో ఉన్నారు. అందుకే వారిని తమ వైపు తిప్పుకునేందుకు కవిత గట్టి ప్రణాళిక వేసుకున్నట్లు అర్థమవుతోంది. ప్రధానంగా కారు పార్టీలు అసంతృప్త నేతలను, నాయకత్వం కోసం వెతుకుతున్న కార్యకర్తలను చేరదీయడమే ప్రధాన పనిగా పెట్టుకున్నారు కవిత. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీని బలహీన పరిస్థితినే తనకు ప్లస్ అవుతుందని ఒక అంచనా. అలా చేసుకుంటూ పోతే తన జోలికి రేవంత్ రారు. అటు బిజెపి సైతం క్షేత్రస్థాయిలో బలపడడం లేదు. అందుకే క్రమేపి పార్టీ బలాన్ని పెంచి 2033 ఎన్నికలను టార్గెట్గా పెట్టుకున్నారు కవిత. అందుకే అధికార పార్టీని కాదని విపక్ష గులాబీ పార్టీని టార్గెట్ చేసుకున్నారు.
-
కొత్త పార్టీ ప్రకటనకు కసరత్తు..
ఈనెల 24న కొత్త పార్టీ ప్రకటనపై కవిత కసరత్తు మొదలుపెట్టారు. ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తన తెలంగాణ జాగృతిని తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా పెడతారని తెలుస్తోంది. అయితే దానికి సాంకేతిక అవరోధాలు ఎదురైతే పాత టిఆర్ఎస్ను పునరుద్ధరిస్తారని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే ఎలా చూసుకున్న తన తండ్రి పార్టీ ఇప్పుడు ఆమె టార్గెట్. ఆ స్థానంలోకి వెళ్లి తెలంగాణ రాజకీయాల్లో పట్టు బిగించాలన్నది కవిత వ్యూహం. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Also Read : రేవంత్ రెడ్డి పాలకుడిలా వ్యవహరిస్తున్నారు.. కేసీఆర్ భేటీ తర్వాత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
