
Viral Video: హీరోయిన్ నిధి అగర్వాల్‌కు బుధవారం ఓ సినిమా ఈవెంట్‌లో అనూహ్యమైన చేదు అనుభవం ఎదురైంది. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్ లోని సహానా సహానా పాట లాంచ్ కార్యక్రమానికి ఆమె హాజరుకాగా.. అక్కడ అభిమానుల అత్యుత్సాహం హద్దులు దాటింది. ఒక్కసారిగా భారీగా అభిమానులు నిధి వద్దకు చేరుకోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఎటు కదలలేని స్థితిలో ఆమె చిక్కుకుపోయారు. బాడీగార్డులు ఎంత ప్రయత్నించినా ఫ్యాన్స్ వెనక్కి తగ్గకపోవడంతో కొద్ది క్షణాలు తీవ్ర గందరగోళం నెలకొంది.
#NidhhiAgerwal I can't express I'm words🙌🏻#ShameOnPMF
Minimum security lekunda endhuku events plan chesthaaru @SKNonline @peoplemediafcy? pic.twitter.com/wh42Jmv4HA
— NIDHHI AGERWAL (@Dholahookesh) December 18, 2025
ఈవెంట్ ముగిసిన అనంతరం బయటకు వస్తున్న సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సెల్ఫీల కోసం కొందరు అభిమానులు నిధి వైపు దూసుకురావడంతో ఆమె భద్రతకు ముప్పు ఏర్పడింది. కొంతమంది ఆమెను తాకేందుకు కూడా ప్రయత్నించడంతో అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. బాడీగార్డులు అభిమానులను అడ్డుకుంటూ, నెట్టుకుంటూ చివరకు అతి కష్టం మీద నిధి అగర్వాల్‌ను కారులో కూర్చోబెట్టారు. కారు ఎక్కిన తర్వాతే ఆమె కొంత ఊపిరి పీల్చుకున్నట్టు కనిపించింది. ఈ ఘటన మొత్తం నిధిలో తీవ్ర అసహనాన్ని కలిగించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. అభిమానుల పేరుతో ఇలా హద్దులు దాటి ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ఒక సెలబ్రిటీ అయినా, ఒక మహిళ అయినా ఆమె వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు హాజరయ్యే కార్యక్రమాల్లో ముందుగానే పక్కా భద్రతా ఏర్పాట్లు చేయాలని, సరిపడా బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు కూడా పరోక్షంగా స్పందిస్తూ, అభిమానుల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ప్రేమ విలువైనదే కానీ, అది భద్రతకు ముప్పుగా మారితే తగదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిర్వాహకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచనలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ది రాజా సాబ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్ తొలిసారి ఈ తరహా జానర్‌లో కనిపించడంతో పాటు వింటేజ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా, సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: ALERT: తెలంగాణలో వచ్చే 4 రోజులు జాగ్రత్త!





