రాజకీయంవైరల్

VIRAL NEWS: ‘కుంభ’గా రేవంత్ రెడ్డి పోస్టర్.. క్రియేటర్స్ అరెస్ట్

తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో గాంధీభవన్ వద్ద అకస్మాత్తుగా వెలిసిన పోస్టర్లు పెద్ద కలకలం రేపాయి.

తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో గాంధీభవన్ వద్ద అకస్మాత్తుగా వెలిసిన పోస్టర్లు పెద్ద కలకలం రేపాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార దిగ్గజాలను, కేంద్రంలో ఉన్న మంత్రులను, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ భారీ స్థాయిలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ సమయంలో ఈ పోస్టర్లు రావడం మరింత చర్చనీయాంశమైంది. రాష్ట్ర బ్రాండింగ్ పెరగాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు సాగు కావాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఈవెంట్ నేపథ్యంలో ఇలా ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎవరో కావాలనే ఈ పోస్టర్లు అంటించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ పోస్టర్లలో ‘వారణాసి’ చిత్రంలోని పృథ్వీరాజ్ పాత్రకు బదులు రేవంత్ రెడ్డి ఫేస్‌ను మోర్ఫ్ చేయడం గమనార్హం. పెద్ద కుర్చీలో సీఎం కూర్చొని ఉన్నట్టుగా, వెనుక రోబోట్ చేతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామాలను ఎగరేస్తున్నట్లు చూపిస్తూ విమర్శాత్మక రీతిలో ఆర్ట్‌వర్క్ రూపొందించడం రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్రంలో రెండు సంవత్సరాల పాలనలో రేవంత్ రెడ్డి డ్యూటీ రిపోర్ట్ అంటూ కూడా ఒక పోస్టర్‌లో పేర్కొనడం, యువ వికాసం పథకంలో ఐదు లక్షల రూపాయలు అందడం లేదని మరో పోస్టర్‌లో సూచించడం స్పష్టంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపడానికి చేసిన రాజకీయ ప్రయత్నం అని స్పష్టమవుతోంది.

ఈ పోస్టర్లు బయటపడిన వెంటనే కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య అని, తమ పార్టీ ఎప్పుడూ ఇలాంటి చిల్లర రాజకీయాలకు దిగలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ ద్వారా రేవంత్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా నిలబడబోతుందని గ్రహించిన ప్రతిపక్షాలు కావాలనే ఈ తరహా ప్రచార యుద్ధానికి దిగుతున్నాయనే అభిప్రాయం కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతోంది.

ఇక మరోవైపు, ఈ పోస్టర్‌ను రూపొందించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇదే సమయంలో బీజేపీ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకోవడం కొత్త వివాదానికి నాంది పలికింది. రేవంత్ ప్రభుత్వం ఒక విధమైన నియంతృత్వ ధోరణిని అవలంబిస్తోందని, విమర్శలను అణచివేయడానికి పోలీసులను ఉపయోగిస్తోందని బీజేపీ ఆరోపించింది. కేంద్ర పార్టీ అధికారిక వేదికలో ఈ అంశాన్ని పంచుకోవడం రాజకీయంగా మరింత పెను ప్రభావం చూపింది.

బీజేపీ నేతలు భారతదేశంలో ఎమర్జెన్సీ మైండ్‌సెట్ ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, తమపై వస్తున్న విమర్శలను భయపడి ఎదుర్కొనలేక ఇలాంటి అరెస్టులకు పాల్పడుతోందని మండిపడ్డారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి వేడెక్కింది. ఈ పోస్టర్ల వివాదం గ్లోబల్ సమ్మిట్‌పై ఏమైనా ప్రభావం చూపుతుందేమో అన్న ఆందోళనలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది.

ALSO READ: ప్రేమ పెళ్లిళ్లు.. పూజారుల సంచలన నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button