క్రైమ్ మిర్రర్, అమరావతి : విజయవాడలో మళ్లీ వరదలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కలకలం రేపింది. బుడమేరు కట్ట తెగిందని మళ్లీ వరద పలు కాలనీలను చుట్టుముట్టిందంటూ సాయంత్రం సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో పలు కాలనీల ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు. కొందరు తమ ఇండ్లలోని ఖరీదైన వస్తువులు తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇటీవల బుడమేరు పొంగడంతో వందలాది కాలనీలు నీట మునిగాయి. దాదాపు వారం రోజులు దాదాపు 3 లక్షల మంది వరదలోనే ఉన్నారు. వరదలకు ప్రభావితమైన ప్రాంతాలన్ని.. బుడమేరు కట్ట తెగిందన్న ప్రచారంతో హడలిపోయారు. ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో విజయవాడలో ఒక్కసారిగా కలకలం రేగింది.
Read More : బట్టలూడదీసి కొడతం.. ఖబర్దార్ కేటీఆర్
ఇప్పుడిప్పుడే వరదల నుంచి తేరుకుంటున్న కాలనీ వాసులు ఆందోళన చెందారు. పలు కాలనీల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తోందని, జక్కంపూడి కాలనీ, కొత్త రాజరాజేశ్వరీపేట సహా పలు కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో అలర్టులు కనిపించాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. వెంటనే అదంతా తప్పుడు ప్రచారం అంటూ చాటింపు వేయించింది. రంగంలోకి దిగిన మంత్రి నారాయణ కలెక్టర్ సృజనతో కలిసి కండ్రిక ఉడా కాలనీలో పరిస్థితిని సమీక్షించారు. కేవలం కొంతమంది ఆకతాయిల పుకార్లు పుట్టించారన్నారు. అలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ.