దసరా పండుగ తెలంగాణలో అతిపెద్ద పండగ. అలాంటి పండగ పూట ఓ గ్రామ కార్యదర్శి అమానుషంగా ప్రవర్తించాడు. వృద్ధుల పెన్షన్ డబ్బులు లాక్కున్నాడు. పండుగ పూట పన్నుల పేరుతో వృద్ధుల పించన్ డబ్బులు వసూలు చేసిన పంచాయితీ కార్యదర్శిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పన్నులు వసూల్ చేశానని చెబుతున్నాడు ఆ గ్రామ కార్యదర్శి.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో వృద్దులకు ఇచ్చిన పెన్షన్‌ల నుండి ఇంటి, నల్లా పన్నులు వసూలు చేశాడు గ్రామ కార్యదర్శి. పండుగ పూట డబ్బులు తీసుకోకండి. ఇంకా మూడు నెలలు సమయమున్నా ఇప్పుడే పన్నులు ఎందుకు తీసుకుంటున్నారని అడిగినా పంచాయితీ కార్యదర్శి వినలేదని వృద్దులు ఆవేదన వ్యక్తం చేశారు.తమ కొడుకుల దగ్గర వసూలు చేసుకోమన్నా వినలేదని, పెన్షన్ డబ్బులు పెంచుతామని చెప్పి పెంచకుండా ఇలా పండగ పూట లాక్కున్నారని వృద్దులు వాపోయారు.
Read More : నెల రోజుల్లోపు కుల గణన.. సీఎం రేవంత్ మరో సంచలనం
వృద్దుల నుంచి పెన్షన్ డబ్బులు లాక్కొవడంపై గ్రామ కార్యదర్శిని ప్రశ్నించగా.. తన డ్యూటీ తాను చేశానని చెప్పాడు. పన్నులు వసూల్ చేయాలని తనకు ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టారని.. అందుకోసమే అలా చేయాల్సి వచ్చిందన్నారు. గ్రామ పంచాయతీలకు గత 9 నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని.. బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పారు. అందుకే పన్నులు వసూల్ చేసి చిన్నా చితకా పనులు చేయాల్సి వచ్చిందని తన వాదన వినిపించాడు గ్రామ కార్యదర్శి.