
తెలంగాణలో కులగణన సర్వే.. కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కులగణన లెక్కల్లో తేడాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. ప్రతిపక్షాలే కాదు.. అధికార కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కూడా… కులగణన లెక్కలపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా బీసీల సంఖ్య తగ్గిందనే మాట… అందరి నోట వినిస్తోంది. దీన్ని సరిచేసేందుకు ప్రభుత్వం… రీసర్వే కూడా చేసింది. అయినా పెద్దగా స్పందన రాలేదు. లెక్కల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. కులగణన సర్వే ఆధారంగా… బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ క్రమంలో… కాంగ్రెస్‌లో కొత్త లొల్లి మొదలైంది.
మొదటి నుంచి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు.. ఇప్పుడు తన సామాజిక వర్గాన్ని సంఘటితం చేస్తున్నారు. నిన్న (శనివారం) వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతలంతా సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో అన్ని పార్టీల మున్నూరు కాపు నేతలు పాల్గొన్నారు. సమావేశం కావడమే కాదు… తమ సామాజికవర్గం బలాన్ని ప్రభుత్వానికి గట్టిగా తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. కులగణన సర్వేలో మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చేసి చూపారన్నది… నేతల ఆరోపణ. తమ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతుంటే ఊరుకోమని అంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి… మున్నూరు కాపుల సంఖ్యను సవరించాలంటూ తీర్మానం కూడా చేసుకున్నారు. మున్నూరు కాపుల సంఖ్య సవరించిన తర్వాత… 5లక్షల మందితో బహిరంగసభ పెట్టి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తారట. ఈ సభ ద్వారా తమ సామాజికవర్గం బలమెంతో ప్రభుత్వానికి చూపాలన్న ఉద్దేశం కూడా మున్నూరు కాపు నేతల్లో కనిపిస్తోంది.
వి.హనుమంతరావు… కాంగ్రెస్ సీనియర్ నేత. ఇప్పుడు ఆయన ఏజ్ బార్ అయిపోయింది. ఏమీ చేయలేరు… అనుకున్న వారంతా… ఈ సమావేశంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వీహెచ్ పిలవగానే.. అన్ని పార్టీల నుంచి సీనియర్ నాయకులు రావడం… ఆయన ఇంట్లో సమావేశం కావడం.. చూసి వీహెచ్ మామూలోడు కాదని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వీహెచ్ ఇంట్లో నేతలంతా సమావేశం అయ్యారు.. తీర్మానాలు కూడా చేసుకున్నారు. అయితే… ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది…? మున్నూరు కాపుల సంఖ్యను సవరించాలన్న వీరి డిమాండ్‌కు ప్రభుత్వం స్పందిస్తుందా…? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే… మున్నూరు కాపు నేతల నెక్ట్స్ స్టెప్ ఏంటి…? అది ఏమో గానీ… రాజకీయాల్లో తాను ఇంకా ఫామ్‌లోనే ఉన్నాను అని వీహెచ్ మరోసారి రుజువుచేసుకున్నారు. తనను లైట్ తీసుకోవద్దని… చెప్పకనే చెప్తున్నారాయన.