Supreme Court On OTTs: ప్రస్తుతం ప్రజలకు చాలా ఓటీటీలు వినోదాన్ని అందిస్తున్నాయి. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరూ ఇళ్లలో కూర్చుని ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు. అయితే సాధారణ సినిమాలు, షోలతో పోల్చుకుంటే ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో వాటిని చూడడం చాలా ఇబ్బందికరం. ఓటీటీలపై ఈ విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఈ విషయంపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఓటీటీలకు ఆధార్ లింక్ చేయాలని సూచన
ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి ఆధార్ ద్వారా వయస్సు ధృవీకరణను అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మల్య బాగ్చి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అశ్లీల కంటెంట్ విషయంలో కొన్ని సూచనలు చేసింది. పుస్తకం, పెయింటింగ్ మొదలైన వాటిలో అశ్లీలత ఉండవచ్చు. ఆ విషయాన్ని ముందుగానే చెబుతారు. కానీ, ఫోన్ ఆన్ చేసిన వెంటనే మీరు కోరుకోనిది, అశ్లీలమైనది ఏదైనా వస్తే, అప్పుడు ఏమి చేయాలి? అని ధర్మాసనం ప్రశ్నించింది
సమయ్ రైనా షోపై విచారించిన సుప్రీం కోర్టు
ఓటీటీ షోల ప్రారంభంలో సాధారణ హెచ్చరికలు ఉన్నప్పటికీ, అదనపు చర్యగా వయస్సు ధృవీకరణ కూడా చేయవచ్చని సీజేఐ సూర్యకాంత్ సూచించారు. ఇందుకోసం ఆధార్ ను వెరిఫై చేయడం మంచిదన్నారు. హాస్యనటుడు సమయ్ రైనా యూట్యూబ్ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’లో సె*క్స్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన కొన్ని పిటిషన్లను కోర్టు విచారించింది. ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు పునరుద్ఘాటించింది. ఏది అనుమతించవచ్చో, ఏది అనుమతించకూడదో నిర్ణయించడానికి ఒక స్వయంప్రతిపత్తి సంస్థ అవసరమని కూడా అభిప్రాయపడింది.





