వేదాంతా గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక విషయాన్ని వెల్లడించారు. తన సంపాదనలో 75 శాతాన్ని సమాజానికి దానం చేయాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆయన కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ (49 ఏళ్లు) అమెరికాలో గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు.
సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు
అగ్నివేశ్ స్కీయింగ్ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అనిల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నా కుమారుడితో కలిసి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మా సంపాదనలో 75 శాతం కంటే ఎక్కువను సమాజానికి ఇస్తాను. ఇకపై మరింత సింపుల్ జీవితం గడుపుతాను’ అని తెలిపారు.’నా తనయుడు అగ్నివేశ్ ఎంతో త్వరగా మమ్మల్ని విడిచివెళ్లిపోయాడు. అతడి వయసు 49 ఏళ్లే. భవిష్యత్తు గురించి ఎన్నో కలలుండేవి. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్.. ఆసుపత్రిలో కోలుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో మమ్మల్ని విడిచివెళ్లిపోయాడు. జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా.. ఎంతో ఒదిగి ఉండేవాడు. ఒక ఫ్రెండ్‌లా నా వెంటే ఉండేవాడు. దేశం స్వావలంబన దిశగా పయనిస్తోందని బలంగా నమ్మేవాడు. మా సంపాదనలో 75 శాతం సమాజానికి తిరిగిస్తానని అగ్నికి వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. అయితే, నువ్వు లేకుండా ఈ దారిలో ఎలా నడవాలో నాకు తెలియడం లేదు. కానీ నీ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను’ అని అనిల్ అగర్వాల్ రాసుకొచ్చారు.
అనిల్ సంపాదన ఎంత అంటే?
అనిల్ అగర్వాల్‌కు అగ్నివేశ్‌తోపాటు కుమార్తె ప్రియ ఉన్నారు. ఆమె వేదాంతా లిమిటెడ్ బోర్డు మెంబర్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వేదాంతా అనుబంధ సంస్థ అయిన తల్వండి సోబో పవర్ లిమిటెడ్‌కు అగ్నివేశ్ ఛైర్మన్. అనిల్ అగర్వాల్ నికర సంపద 330కోట్ల డాలర్లు.
ప్రధాని మోడీ సంతాపం..
అగ్నివేశ్ అకాల మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యమివ్వాలని ప్రార్థిస్తున్నానంటూ అనిల్ అగర్వాల్ పోస్టుపై మోడీ స్పందించారు.





