
వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయన రిమాండ్ నేటితో (మంగళవారం) ముగుస్తుండటంతో… పోలీసులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. వంశీ రిమాండ్‌ను పొడిగించాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో… వంశీ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది న్యాయస్థానం. వంశీతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురికి కూడా రిమాండ్ పొడిగించింది.
మరోవైపు… ఇదే కేసులో వంశీని పటమట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న… వంశీని మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో వంశీని… కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ సమయంలో నాలుగు సార్లు లాయర్‌ను కలిసేందుకు వంశీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే… విజయవాడ పరిధిలోనే విచారణ జరపాలని ఆదేశించారు. కస్టడీకి తీసుకునే ముందు.. కస్టడీ పూర్తైన తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా షరతు పెట్టింది.
అంతేకాదు… వల్లభనేని వంశీపై భూకబ్జాల ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై విచారణ కోసం నిన్న (సోమవారం) సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏలూరు డీఐజీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం వంశీ భూకబ్జా ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది.