
Vaishali: మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల పరిధిలోని వెంట్రావుపల్లి గ్రామం ఇటీవల రాజకీయంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ గ్రామ సర్పంచ్ పదవికి ట్రాన్స్ జెండర్ వర్గానికి చెందిన వైశాలి నామినేషన్ దాఖలు చేయడం అక్కడి ప్రజల్లోనే కాదు.. మొత్తం జిల్లాలో చర్చనీయాంశమైంది. సర్పంచ్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించినప్పటికీ, ఎస్సీ ట్రాన్స్‌జెండర్ అయిన వైశాలి ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజాసేవ కోసం పోటీ చేయడం సామాజిక మార్పుకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది.
వైశాలి గత కొన్నేళ్లుగా గ్రామంలోనే నివసిస్తూ, అక్కడి ప్రజల సమస్యలు, అవసరాలను లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి. చిన్నపాటి పనులు చేయడం నుంచి, గ్రామీణ మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వరకు ప్రజలతో మమేకమై ఉన్నారు. గ్రామ అభివృద్ధి, శుభ్రత, తాగునీటి సమస్యలు, కాలువల సమస్య, గృహ నిర్మాణాలు, హరితహారం వంటి అనేక అంశాల్లో సేవ చేయాలని ఆమె కోరుకుంటున్నారు.
తనను ఆదరించి గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని వైశాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ వ్యక్తులు కూడా సమాజంలో సమాన అవకాశాలు పొందాలి, నాయకత్వంలో వారు కూడా నిలబడగలరని ప్రామాణికంగా నిరూపించేందుకు ఈ ఎన్నిక తనకు ఒక గొప్ప వేదికగా భావిస్తోంది. అభివృద్ధి దారిలో గ్రామంలోని ప్రతి కుటుంబం సాగాలన్నది వైశాలి లక్ష్యం.
ప్రజలకు శుభ్రమైన తాగునీరు, గ్రామంలో అన్ని రహదారుల అభివృద్ధి, విద్యకు ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు స్వయం సహాయక సంఘాల బలోపేతం వంటి అనేక అంశాలను ప్రధాన అజెండాగా ప్రకటించేందుకు కూడా ఆమె సిద్ధంగా ఉన్నారు. ప్రజలు తనను నమ్మి గెలిపిస్తే అభివృద్ధి, పారదర్శక పాలన, అందరికీ సమాన సేవ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతానని వైశాలి చెబుతున్నారు. వెంట్రావుపల్లి ప్రజల ఆదరణ, మద్దతు తనకు లభిస్తే గ్రామంలో మార్పు తీసుకురావడమే తమ ప్రథమ సంకల్పమని తెలిపింది.
ALSO READ: DRDO: 764 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల





