Unnao Rape Case Survivor Dragged: ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితుడి శిక్షను ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంపై బాధితురాలు, ఆమె తల్లి చేపట్టిన నిరసన పలు పరిణామాలకు దారితీసింది. తమ న్యాయవాదిని, మీడియాను కలిసేందుకు వీరు చేసిన ప్రయత్నాలను భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. వారిని తరలిస్తున్న బస్సు నుంచి నిందితురాలి తల్లి కిందికి దూకాల్సిన పరిస్థితి తలెత్తింది. నిందితుడికి శిక్ష నిలిపివేత తమకు మరణశాసనమేనని తల్లీకుమార్తె భయాందోళన వ్యక్తంచేశారు.
ఇండియా గేట్ దగ్గర ఆందోళన
నిందితుడు కుల్దీప్‌సింగ్ సెంగర్‌కు జైలు శిక్షను నిలిపివేయడంపై మహిళా హక్కుల ఉద్యమకర్త యోగితా భయానాతో కలిసి మంగళవారం రాత్రి వీరిద్దరూ ఇండియాగేట్ ఎదుట నిరసన చేపట్టారు. న్యాయవాదిని కలిసేందుకు ఇంటినుంచి బయల్దేరిన తనను సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకుని, తిరిగి వెనక్కి పంపించేందుకు ప్రయత్నించాయని, బస్సులోనూ గట్టిగా అరవడంతో చివరకు లాయర్ వద్దకు తీసుకువెళ్లాల్సిందిగా బలగాలకు ఆదేశాలు వచ్చాయని బాధితురాలి తల్లి చెప్పారు. తోపులాటలో బాధితురాలు గాయపడినట్లు భయానా తెలిపారు. బస్సు దిగేందుకు బాధితురాలి తల్లిని సీఆర్పీఎఫ్ అనుమతించలేదు. ఆమెను చేతులతో తోస్తూ కదులుతున్న బస్సులోంచి కిందకు దూకమని అడిగినట్లు కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాంతో ఆమె దూకేయగా, బాధితురాలితో బస్సు వెళ్లిపోయింది. తమను బతకనివ్వరని, కచ్చితంగా చంపేస్తారని ఆ తల్లి రోడ్డుపైనే విలపించిన వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని వారు కలిసి ఆవేదనను పంచుకున్నారు. సెంగర్‌కు విధించిన శిక్షను హైకోర్టు నిలిపివేయడంపై సుప్రీంకోర్టులో తక్షణం సవాల్ చేయాలని సీబీఐ నిర్ణయించిందని అధికారులు తెలిపారు.
అతడికి బెయిల్ మాకు మరణం
తాజా పరిణామాలు తమ భయాలను మరింత పెంచాయని బాధితురాలు చెప్పింది. ఇలాంటి కేసుల్లో నిందితుడికి బెయిల్ వస్తే.. మహిళలు సురక్షితంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సెంగర్‌కు బెయిల్ లభించడం తమకు మరణం కంటే తక్కువేం కాదన్నారు. డబ్బు లేనివారికి ఎప్పుడూ ఓటమేననే విషయాన్ని ఈ పరిణామం నిరూపిస్తోందని విలపించారు. సెంగార్‌కు శిక్ష నిలిపివేతపై సుప్రీంకోర్టుకు వెళ్తామని బాధితురాలి తల్లి చెప్పారు.





