Parliament Budget Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు, ఫిబ్రవరి 1న సభ ముందుకు బడ్జెట్‌!

ఇవాళ్టి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈసారి బడ్జెట్‌లో కీలక సంస్కరణలు, ప్రకటనలు వెలువడే అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Government Prepares People-Friendly Union Budget: జనాకర్షక బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ సారి బడ్జెట్‌లో కీలక సంస్కరణలు, ప్రకటనలు వెలువడే అవకాశముంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్‌ ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగులు, మధ్య తరగతి, రైతులు, కూలీలు ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనాలు కలిగేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా భార్యాభర్త లు ఇద్దరూ ఉమ్మడిగా ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేసే అవకాశం, వైద్య రంగంలో స్వదేశీ తయారీ, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల్లో డిజిటల్‌ విప్లవం, స్టార్టప్‌, ఇన్నోవేషన్‌-డీప్ టెక్‌ వైపు అడుగులు, కస్టమ్స్‌ సుంకాల హేతుబద్ధీకరణ తదితరాలపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు

రెండు విడతలుగా జరిగే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు రెండో విడత నిర్వహిస్తారు. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఆమె వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. మరోవైపు, పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగనుంది.

నరేగా రద్దుపై చర్చకు విపక్షాల పట్టు

బడ్జెట్‌ సమాశాల్లో నరేగా రద్దు, ఎస్‌ఐఆర్‌, యూజీసీ కొత్త మార్గదర్శకాలు వంటి అంశాలను లేవనెత్తాలని, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక, విదేశాంగ విధానాల్లో కీలకాంశాలపై స్పష్టత కోసం డిమాండ్‌ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరిగింది. పార్టీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అలాగే వివిధ విపక్ష పార్టీల నేతలు కూడా ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు బుధవారం ఉదయం పార్లమెంటు హౌస్‌లోని ఖర్గే చాంబర్‌లో భేటీ కానున్నారు. అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button