
క్రైమ్ మిర్రర్, హయత్‌నగర్ : అదుపుతప్పిన కారు మృత్యుపాశంగా మారి ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్న హృదయవిదారక ప్రమాదం మంగళవారం హయత్‌నగర్ మండలంలోని కుంట్లూరులో చోటుచేసుకుంది. సింగిల్ రోడ్డు, మలుపు ప్రాంతంలో వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న డీసీఎం ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
కారులో ప్రయాణిస్తున్న చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిలు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసుల ప్రకారం, కారులో ఉన్నవారు కంట్లూరుకు చెందిన వారే. ఒక బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. “ఇంకొన్ని సెకన్లలో ఇంటి గుమ్మం దాటి ఉండేవారు… కానీ అంతలోనే ఈ విషాదం” అంటూ స్థానికులు కంటతడి పెట్టారు.
ప్రమాద తీవ్రతను తెలియజేస్తూ విడుదలైన సీసీ కెమెరా ఫుటేజ్ షాకింగ్‌గా మారింది. కారు లారీని ఢీకొట్టిన వేళ, మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. స్థానికులు ఎంతో కష్టంగా వాటిని బయటకు తీశారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.