క్రైమ్

గంజాయి బానిసలుగా మారి దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు యువకులు అరెస్ట్

చిట్యాల, నల్గొండ జిల్లా (క్రైమ్ మిర్రర్): గంజాయి మత్తుకి బానిసలుగా మారి, దాన్ని కొనుగోలు చేసి అమ్ముతూ, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చిట్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) కె. నాగరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో వివరించారు. తాజాగా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ గుంటూరు చైతన్య ఇంట్లో దొంగతనం జరిగింది. మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో చిట్యాల గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ ఎక్స్‌రోడ్ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం ఎస్ఐ రవి కుమార్‌కు అందింది. వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు.

వారి వద్ద నుండి సుమారు 1.25 కిలోల గంజాయి, చోరీ చేసిన ల్యాప్‌టాప్, మూడు ఖరీదైన చేతి గడియారాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన నిందితులు గంజాయి తాగడానికి అలవాటు పడి, దానికోసం సులభంగా డబ్బు సంపాదించడానికి ఒక పథకం ప్రకారం గంజాయి వ్యాపారం మొదలుపెట్టినట్టు వెల్లడించారు. గంజాయిని సుమారు 1,250 గ్రాములు కొనుగోలు చేసి చిట్యాల చుట్టుపక్కల గంజాయి సేవించే వారికి అమ్మాలని ప్రయత్నిస్తున్నట్టు అంగీకరించారు. అలాగే, డబ్బు అవసరంతో తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు.

నిందితుల వివరాలు : దండుగుల శివ కుమార్ (23), సాయి గణేష్ నగర్ కాలనీ, మీర్‌పేట్, హైదరాబాద్ నివాసి. తలారి మనోజ్ కుమార్ (22), ఆటో డ్రైవర్, బైరంపూర్ గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. ఈ కేసును నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, నార్కెట్‌పల్లి సీఐ కె. నాగరాజు ఆధ్వర్యంలో, చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు మధు, రాంబాబు, రైటర్ వెంకన్న, కానిస్టేబుళ్లు ఖలీమ్, సాయి, ఆనంద్, జాన్ రెడ్డిలు సక్రమంగా దర్యాప్తు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌కు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (ఐపీఎస్) ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, గంజాయి, ఇతర మత్తుపదార్థాలను సరఫరా చేసే వారి పైనా, సేవించే వారి పైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, అవగాహనతో ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button