
మిర్యాలగూడ, (క్రైమ్ మిర్రర్):-తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సు దగ్దం ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ ఎం.లక్ష్మయ్య గురువారం రాత్రి వెల్లడించారు. జూలై 23 అర్ధరాత్రి 2 గంటల సమయంలో తడకమళ్ల గ్రామ సెంటర్లో ఎంపీపీ పాఠశాల ఎదుట పార్క్ చేసిన టిజి 05 జడ్ 0047 నంబర్ గల మిర్యాలగూడ డిపో ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటనపై విచారణ ప్రారంభించగా, పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Read also : రైతులకు తీపికబురు, రేపే రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు!
వివరాల్లోకి వెళ్తే...బస్సు దగ్దం చేయడంలో స్థానికులు కుసుమ సుదర్శన్ రెడ్డి, తంగేళ్ల జానకి రెడ్డి పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. సుదర్శన్ రెడ్డి తన పొలం పక్కన ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వ్యవహారాన్ని గ్రామస్తులు విమర్శించడంతో, దృష్టి మళ్లించేందుకు ఈ దాడికి పాల్పడ్డట్లు దర్యాప్తులో తేలింది.వారిద్దరూ పథకం ప్రకారం సుదర్శన్ ఇంటి నుండి డీజిల్ తీసుకొని, కాగడాతో కలిపి బస్సులో నిప్పంటించారు. అనంతరం ఎవరికీ తెలియకుండా గ్రామం విడిచి వెళ్లగా, మళ్లీ గ్రామానికి వస్తుండగా సబ్‌స్టేషన్ వద్ద పట్టుబడ్డారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. వారితో పాటు దాడికి ఉపయోగించిన బట్టలు, లైటర్, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితుల్లో సుదర్శన్ రెడ్డిపై ఇప్పటికే 8 కేసులు, జానకి రెడ్డిపై 5 కేసులు ఉన్నాయి.ఈ ఘటనపై సెక్షన్ 379, 426 ఐపీసీ, 303(2), 329(3), 351(2), 61(2), 326(G) రీడ్ విత్ 3(5) బిఎన్ఎస్, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ – 1984 కింద కేసు నమోదు చేసి, ఇద్దరిపైనా రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ఇలాంటి చర్యలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడమే కాక ప్రజల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించిన ఎస్ఐ లక్ష్మయ్య, భూములు ఆక్రమించడమో, హింసాత్మక చర్యలకో పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికైనా ఇలాంటి నేరస్తుల వల్ల ఇబ్బంది ఉంటే పోలీసులను నిర్భయంగా ఆశ్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read also : శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద, సాగర్ లోకి కృష్ణమ్మ పరుగులు!