Homeఆంధ్ర ప్రదేశ్Kala Venkatarao: టీటీడీ చైర్మెన్ గా కళా.. త్వరలో నియామకం!

Kala Venkatarao: టీటీడీ చైర్మెన్ గా కళా.. త్వరలో నియామకం!

* బిఆర్ నాయుడు మార్పు అనివార్యం

* కళా వెంకట్రావు వైపు మొగ్గు చూపిన చంద్రబాబు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ను మార్చుతారా? బి ఆర్ నాయుడు స్థానంలో కొత్తవారు వస్తారా? అయితే ఎవరితో భర్తీ చేస్తారు? ఈసారి ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తారు? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. అయితే, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన నియామకం ఉంటుందని ప్రచారం నడుస్తోంది.

కీలకమైన పదవి..

2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో కీలకంగా ఉన్న టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియామకం పై దృష్టిపెట్టారు చంద్రబాబు. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు అంటే రాష్ట్ర ప్రభుత్వంతో సమానం.. అటువంటి ట్రస్ట్ బోర్డు కు చైర్మన్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానం. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంటే మంత్రులతో సమానంగా గౌరవ మర్యాదలు ఉంటాయి. అందుకే చాలామంది టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్ట్ కోసం ప్రయత్నించారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం టీవీ5 అధినేత బిఆర్ నాయుడు వైపు మొగ్గు చూపారు. ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ప్రతి రెండేళ్లకు ఒకసారి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియామకం చేపట్టాలి. ఆయన నియామకం జరిగి దాదాపు రెండేళ్లు పూర్తవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల తలెత్తిన వివాదాల నేపథ్యంలో బిఆర్ నాయుడు మార్పు అనివార్యంగా తెలుస్తోంది.

కాపులకు ప్రాధాన్యం..

అయితే ఈసారి కాపు సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో తన సొంత సామాజిక వర్గం వారికి ఆ పదవి ఇచ్చారు.. తొలుత తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఆ పదవి చేపట్టారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన బి.ఆర్ నాయుడుకు ఛాన్స్ ఇచ్చారు. అందుకే ఈసారి కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా.. ప్రాంతీయ, సామాజిక సమతూకం పాటించినట్లు అవుతుంది. ప్రముఖంగా కిమిడి కళా వెంకట్రావు పేరు వినిపిస్తోంది.

సుదీర్ఘ నేపథ్యం..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు కిమిడి కళా వెంకట్రావు. 2009లో మాత్రం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి.. మళ్లీ టీడీపీలోకి వచ్చేసారు. 1983 నుంచి 2004 వరకు ఉణుకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1994 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే 2009 నియోజకవర్గాల పునర్విభజనతో ఆయన ఎచ్చెర్ల వైపు వచ్చారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి టిడిపిలోకి వచ్చి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు. తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2019లో అదే నియోజకవర్గ నుంచి ఓడిపోయిన కళా వెంకట్రావు.. 2024 ఎన్నికలకు ముందు విజయనగరం జిల్లా చీపురుపల్లి కి షిఫ్ట్ అయ్యారు. సీనియర్ నేత బొత్సను ఓడించారు. మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఆయన పేరు వినిపిస్తోంది.. చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ నియామకానికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments