గేమ్ ఛేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతి, టికెట్ రెట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. అనుమతి ఇచ్చిన తెలంగాణ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వేళకాని వేళల్లో బెనిఫిట్ షోస్ అవసరం ఏముందని ప్రశ్నించింది. ఇటీవల జరిగిన ఉదంతాలు చుసిన తరువాత కూడా మారరా అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ప్రజల భద్రత గురించి కనీసం ఆలోచించరా అంటూ నిలదీసింది. ఈనెల 8న ఇచ్చిన సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా ప్రదర్శనకు సమయపాలన ఉండాలి.. అర్దరాత్రి, వేకువజామున అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని జస్టిస్ కామెంట్ చేశారు. 16 ఏళ్ల లోపు పిల్లలను అర్దరాత్రి, తెల్లవారుజాము ప్రదర్శనల్లో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.