తెలంగాణ

జనవరి 26 నుంచి రేషన్ కార్డులు.. రైతు భరోసా 12 వేలు

తెలంగాణ సర్కార్ కొత్త సంవత్సరంలో రైతులకు సంబరపడే వార్త చెప్పింది. రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందించింది. కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు .తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతమున్న రూ.10వేల రైతు భరోసాను రూ.12వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పథకానికి “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా” నామకరణం చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయన్నారు. రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు) రైతు భరోసా వర్తించదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే తమ ప్రభుత్వం విధానమన్నారు రేవంత్.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button