
Jefferies Report: వ్యక్తిగత కోపంతోనే భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారని అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫెరీస్ తన నివేదికలో వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు తనను అనుమతించలేదన్న కోపంతోనే భారత వస్తువులపై సుంకాలను పెంచారని తేల్చి చెప్పింది.
ఈ ఏడాది మేలో భారత్, పాక్ మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక దాడుల్లో జోక్యం చేసుకోవాలని ట్రంప్ ఆశించారని నివేదిక పేర్కొంది. కానీ, ఈ వివాదంతో భారత్ మూడో దేశం జోక్యాన్ని కోరుకోలేదని తెలిపింది. ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ట్రంప్ అడ్డగోలుగా సుంకాలు విధిస్తున్నారని వెల్లడించింది. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి రావాలని ప్రయత్నిస్తున్నారని, అన్ని దేశాల వివాదాలను తనే పరిష్కరించినట్లు భావిస్తున్నారని జెఫెరీస్ నివేదిక తెలిపింది. భారత్ ఈ విషయంలో ట్రంప్ మద్దతు తీసుకోకపోవడంతో ఆయనకు శాంతి బహుమతి ఆశలు గల్లంతయ్యాయని వెల్లడించింది. ఈ కారణంగా భారత్ మీద కోపం పెంచుకున్నారని చెప్పుకొచ్చింది.
అటు భారత్, అమెరికా మధ్య వాణిజ్య బంధం క్షీణించడానికి వ్యవసాయం మరో ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది. వ్యవసాయ రంగంలో దిగుమతులకు భారత్ ఏనాడూ అనుమతులు ఇవ్వాలేదని చెప్పింది. అంతేకాదు, రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల విషయంలో రాజీపడబోమని మోడీ తేల్చి చెప్పడం ట్రంప్ కు నచ్చలేదన్నారు. ఫలితంగా భారత్ పై ట్రంప్ టారిఫ్ ల పేరుతో ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని జెఫెరీస్ నివేదిక తేల్చి చెప్పింది.