
Trump On Indian Workers: భారత్ తో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ప్రయోజనాలు పొందుతూ చైనాలో తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా కొన్ని కంపెనీలు అక్కడ భారత ఉద్యోగులను తీసుకుంటున్నాయన్నారు. చైనాలో తమ కంపెనీలను స్థాపించడం, అక్కడ భారతీయ ఉద్యోగలను తీసుకోవడం ద్వారా సదరు కంపెనీలు అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు. వాషింగ్టన్ లో జరిగిన ఏఐ సమ్మిట్ కు హాజరైన పలు అమెరికా టెక్ కంపెనీలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాడికల్ గ్లోబలిజం కుదరదు!
అమెరికా ప్రయోజనాలు పొంది, ఇతర దేశాలకు మేలు చేస్తామని టెక్ కంపెనీలు చూస్తే, ఊరుకోమని ట్రంప్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో విజయం సాధించడానికి సిలికాన్ వ్యాలీ లోపల, వెలుపల దేశభక్తి, జాతీయ విధేయత అవసరమన్నారు. అమెరికా టెక్ పరిశ్రమ రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించిందన్న ఆయన.. ఈ విధానం మిలియన్ల మంది అమెరికన్లకు అపనమ్మకాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ యాక్షన్ ప్లాన్ సహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన మూడు ఎగ్జిక్యుటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లూప్రింట్ ను ట్రంప్ విడుదల చేశారు. కీలక సాంకేతిక పరిజ్ఞానంలో చైనాపై అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నంలో పర్యావరణ నిబంధనలను సడలించడం, మిత్రదేశాలకు కృత్రిమ మేధ ఎగుమతులను విస్తరించడం లక్ష్యంగా ఈ బ్లూప్రింట్ ను రిలీజ్ చేశారు. 21వ శతాబ్దాన్ని.. AI శతాబ్దంగా అభివర్ణించిన ఆయన, చైనాతో సాంకేతిక ఆయుధ పోటీలో ఎప్పుడూ ముందంజలో ఉండాలన్నారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలు భారతీయ టెక్ నిపుణులలో ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని భయపడుతున్నారు.
Read Also: భారత్-యూకే మధ్య కీలక ట్రేడ్ డీల్, చారిత్రాత్మక రోజుగా అభివర్ణించిన మోడీ!