
India-US Trade Deal: అమెరికా అధ్యక్షుడు భారత్ మీద విధించిన 50 శాతం టారిఫ్ లు రేపటి (ఆగస్టు 27) నుంచి అమలు కాబోతున్నాయి. ప్రస్తుతం 25శాతం టారిఫ్ లు అమలు అవుతుండగా, ఇకపై మరో 25 శాతం పెరగనున్నాయి. ఇది ఎగుమతి దారులపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అమెరికా విధించిన భారీ సుంకాలు ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఎగుమతిదారుల కోసం తీసుకుంటున్న చర్యలపై ఇవాళ ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నది. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పలు రంగాలపై టారిఫ్ ల ఎఫెక్ట్!
అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమలులోకి వస్తే వ్యవసాయం, ఫార్మా, జౌళి, చర్మ ఉత్పత్తులపై ప్రభావం పడనున్నాయి. ఎగుమతులపైనే ఆధారపడిన పరిశ్రమలు, చిన్న, మధ్యతరహా సంస్థలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ జరిగే సమావేశంలో ఎగుమతిదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇవ్వాలనే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఎగుమతిదారులపై భారం పడకుండా అససరమైతే రాయితీలు కల్పించే అంశంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.