
US ambassador Sergio Gor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ ను నియమించారు. ఇరుదేశాల మధ్య టారిఫ్ లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్ హౌస్ లో పర్సనల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. 38 ఏళ్ల సెర్గియో అధ్యక్షుడు ట్రంప్ నకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది.
ట్రూత్ లో వెల్లడించిన ట్రంప్
సెర్గియో నియామకంపై ట్రంప్ ట్రూత్ లో కీలక ప్రకటన చేశారు. “భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ను నియమిస్తున్నాను. దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగానూ విధులు నిర్వహించనున్నారు. సెర్గియో నాకు గొప్ప స్నేహితుడు. చాలా ఏళ్లుగా నాకు మద్దతుగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో నా విజయం కోసం ఎంతో కృషి చేశారు. నా బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను పబ్లిష్ చేశారు. మా ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వాటిలో ఒకటైన సూపర్ ఫ్యాక్స్ ను నడిపాడు. అమెరికా అధ్యక్ష సిబ్బంది డైరెక్టర్‌గా అతని పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశానికి నా ఎజెండాను నెరవేర్చడానికి, అమెరికాను గొప్పగా తీర్చిదిద్దడంలో సహాయపడడానికి నేను పూర్తిగా విశ్వసించే ఒక వ్యక్తి చాలా ముఖ్యం. సెర్గియో గొప్ప రాయబారి అవుతాడు. అతడికి నా అభినందనలు’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.