
India America Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు కీలక హెచ్చరికలు జారీ చేశాడు. భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదరకపోతే, ఇండియన్ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తామని తేల్చి చెప్పారు. వాణిజ్య ఒప్పందానికి ఆగస్టు 1 గడువు విధించారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో.. సుంకం ఇంకా ఖరారు కాలేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ వెల్లడించారు. ట్రంప్ ఇప్పటికే డజనుకు పైగా దేశాలకు లేఖల ద్వారా సుంకాల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, భారత్ కు లిఖిత హెచ్చరిక మాత్రం ఇంకా జారీ చేయలేదు.
భారత్-అమెరికా వాణిజ్య సమస్యలు
భారత్ తో అమెరికా వాణిజ్య సంబంధాలను చాలా కష్టమైన పని అని ట్రంప్ వెల్లడించారు. గత దశాబ్దంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగినప్పటికీ, అమెరికా వస్తువుల వాణిజ్య లోటు రెట్టింపు అయిందన్నారు. భారత్ విధిస్తున్న అధిక సుంకాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఫిబ్రవరి 13న ప్రధాని మోడీతో సమావేశానికి ముందు, భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ కామెంట్ చేశారు. మోడీతో జరిగిన చర్చల్లో కూడా, తమతో సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. వాణిజ్య డేటా ప్రకారం గత సంవత్సరం అమెరికా భారత్ నుంచి 87 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోగా, భారత్ అమెరికా నుంచి 42 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ట్రంప్ గత కొన్ని నెలలుగా భారత్ తో వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయిందని చెబుతున్నారు. మే నెలలో, అమెరికా ఎగుమతులపై భారత్ సున్నా సుంకం విధించడానికి అంగీకరించిందని ఆయన తెలిపారు. అయితే, ఈ వాదనను భారత్ తోసిపుచ్చింది. ఆగస్టు 1 గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు దేశాలు చర్చలను ముమ్మరంగా కొనసాగుతున్నాయి.