
TRENDING NEWS: తెలంగాణ రాజకీయాల్లో మంగళవారం జరిగిన ఒక కీలక వ్యాఖ్య ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాంధీ భవన్‌లో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ, మత, సామాజిక వర్గాల్లో పెద్ద స్పందనను రేకెత్తిస్తున్నాయి. ఈ సమావేశానికి AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, పలు మంత్రులు, ఇటీవల నియమితులైన జిల్లా అధ్యక్షులు, అలాగే పూర్వ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు, బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై జరిగే ఒక సాధారణ చర్చలా ప్రారంభమైనా, రేవంత్ వ్యాఖ్యల తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది.
పార్టీ లోపల ఏకాభిప్రాయం లేదనే విమర్శలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. మన సమాజంలోనే దేవుళ్ల విషయంలో కూడా ఏకాభిప్రాయం లేదని, అటువంటి జనాలతో నిండిన ఒక పెద్ద పార్టీలో 100 శాతం ఏకాభిప్రాయం ఎలా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలో ఆయన మతాన్ని విమర్శించలేదు.. కానీ హిందూ సమాజంలో ఉన్న వివిధ ఆచారాలు, విభిన్న ఆరాధనా విధానాలను ఉదాహరణగా చెబుతూ పార్టీ నిర్మాణంలో అనేక భావాలు సహజమని వివరించే ప్రయత్నం చేశారు.
హిందూ ధర్మంలో 3 కోట్ల దేవతలు ఉన్నారని, పెళ్లి కానివారు హనుమంతుడిని, పెళ్లయిన వారు ఇతర దేవతలను, కొందరు శివమాల వేసుకునేవారని, ఇంకొందరు అయ్యప్పమాలను పాటించేవారని తెలిపారు. అలాగే మద్యపానం చేసే వారు, పప్పన్నం తినేవారు, మాంసాహారులు- ఇలా వేర్వేరు జీవనశైలులు ఉన్నవారు కూడా తమకూ ఒక్కో దేవతను నమ్ముతారని ఆయన ప్రస్తావించారు. దేవుళ్ల విషయంలో కూడా మనుషుల అభిప్రాయాలు, ఆచారాలు భిన్నంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ లాంటి విస్తృత భావజాలం కలిగిన రాజకీయ వేదికలో పూర్తి ఏకాభిప్రాయం కోరడం సాధ్యం కాదని ఆయన భావం వ్యక్తం చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో వివిధ వర్గాల్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు రేవంత్ వ్యాఖ్యలు హిందువులను అవమానించేలా ఉన్నాయని విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన చెప్పింది యథార్థం అని అంటున్నారు. హిందూ సంప్రదాయాల్లో భిన్నత్వం సహజమని, అదే విషయాన్ని ఉదాహరణగా చెప్పారని సమర్థించే వర్గం కూడా ఉంది.
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు ఎల్లప్పుడూ వివాదాలకు దారితీసే శక్తి కలిగినవే. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన మాటల అసలు ఉద్దేశ్యం పార్టీలో వైవిధ్యాన్ని సహజంగా అర్థం చేసుకోవాలని, అందరినీ ఒకే భావంతో కూర్చోపెట్టడం అసాధ్యమని చెప్పడమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ వ్యాఖ్య ఎటు వైపు మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
ALSO READ: Preschool For Children: తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..





