
ప్రప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే సేవలను వినియోగిస్తూ ఒక చోటు నుంచి మరో చోటుకు యాణిస్తున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ కాలానుగుణంగా నిబంధనల్లో మార్పులు చేస్తూ, కొత్త సదుపాయాలను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళ సుదూర ప్రయాణాలు చేసే వారికి ప్రశాంతమైన నిద్ర లభించేలా కొన్ని కఠినమైన నియమాలను అమలు చేస్తోంది.
రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. స్పీకర్లలో లేదా మొబైల్ ఫోన్లలో బిగ్గరగా మ్యూజిక్ వినడం పూర్తిగా నిషేధించబడింది. సంగీతం వినాలనుకుంటే తప్పనిసరిగా ఇయర్ ఫోన్లు ఉపయోగించాలి. అదే విధంగా కోచ్‌లో లేదా కంపార్ట్‌మెంట్‌లో పెద్దగా ఫోన్‌లో మాట్లాడటం కూడా అనుమతించరు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా మెలకువగా వ్యవహరించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రాత్రి వేళ ప్రధాన లైట్లను ఆపివేయడం నిబంధనగా ఉండగా, అవసరమైతే బెర్త్ వద్ద ఉన్న నైట్ లైట్లు లేదా రీడింగ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలి. ఈ నియమాలను ఉల్లంఘించిన ప్రయాణికులపై జరిమానాతో పాటు తగిన చర్యలు తీసుకునే అధికారం రైల్వే సిబ్బందికి ఉంది.
ఇక రాత్రి ప్రయాణాల్లో భద్రత కూడా అత్యంత ముఖ్యమైన అంశం. ప్రయాణికులు తమ విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్ చేసే వీలున్న బ్యాగులు లేదా బలమైన జిప్‌లు ఉన్న లగేజీని ఉపయోగించడం మంచిది. వీలైతే బ్యాగులను బెర్త్ కింద ఉంచి చైన్‌తో కట్టడం ద్వారా దొంగతనాల నుంచి రక్షణ పొందవచ్చు. నగదు, ఫోన్, ముఖ్యమైన డాక్యుమెంట్లు వంటి విలువైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ లగేజీలో ఉంచకుండా, మీ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి.
ఫోన్ బ్యాటరీ అయిపోకుండా పవర్ బ్యాంక్‌ను దగ్గరలో ఉంచుకోవడం కూడా ఎంతో అవసరం. సీటు దగ్గర ప్లగ్ పాయింట్ లేకపోతే ఫోన్‌ను దూరంగా ఛార్జ్ చేయడం ప్రమాదకరం కావచ్చు. అలాగే సుదూర రైలు ప్రయాణాలకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం, ఎందుకంటే చివరి నిమిషంలో టికెట్ దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రైల్వే నిబంధనలు పాటిస్తూ, కొంచెం అప్రమత్తతతో ప్రయాణిస్తే రాత్రి రైలు ప్రయాణం మరింత సుఖంగా, భద్రంగా మారుతుందని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 311 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల





