
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా మరియు ఉల్లి ధరలు అనేవి భారీగా పడిపోయాయి. మార్కెట్ లో టమాటాకు, ఉల్లిగడ్డలకు ధరలు లేకపోవడంతో అవి పండించిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా, పత్తికొండ మార్కెట్లో నిన్న టమోటా కిలో 2 రూపాయలకు పడిపోవడంతో రైతులు తల పట్టుకుంటున్నారు. మరోవైపు నంద్యాల మరియు మదనపల్లి మార్కెట్లలో 3 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పలుకుతుంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులైతే ఉల్లి క్వింటా 150 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పెట్టుబడి ఖర్చు పెట్టి టమాటాలను, ఉల్లిని పండిస్తుంటే మార్కెట్లలో సరైన ధర లేక తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రేమతో, ఎక్కువ పెట్టుబడితో పండించిన పంటలు ఇలా తక్కువ ధరలకు అమ్ముడుపోతే మేము ఎలా బతకాలని ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఇంత తక్కువ ధరలకు అమ్ముడుపోవడం వల్ల కూలి ఖర్చులకు కూడా డబ్బులు రావట్లేదని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. వెంటనే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించి ఉల్లి మరియు టమాటా రైతులను తక్షణమే ఆర్థిక సాయం లేదా సరైన ధరలను నియమించాలని ఏపీ రైతులు కోరుతున్నారు. లేదంటే ఎంతో కష్టపడి పండించిన ఉల్లి మరియు టమాటా పంటలను నాశనం చేసుకోవడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయని రైతులు తమ బాధను చెప్పుకుంటున్నారు. కాగా గతంలో కూడా ఇలాంటి సందర్భాలు దేశవ్యాప్తంగా ఎన్నో చూశాం. ప్రభుత్వాలు ఆదుకుంటే తప్ప ఈ రైతులకు నష్టాలే తప్ప లాభాలు అనేవి ఉండవు. కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కొన్ని రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
Read also : రాష్ట్రం ఏమన్నా మీ అబ్బ సొత్తా.. నీవల్ల నష్టపోయేది విద్యార్థులే : మంత్రి సత్య కుమార్
Read also : చిన్న జట్టుపై బుమ్రా ను ఆడించడం అవసరమా?.. ఆగ్రహిస్తున్న ఫ్యాన్స్!