జాతీయంవైరల్

నేడే భోగి.. ఈ రోజు ఏం చేయాలి? ఇలా చేశారంటే..?

మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సంప్రదాయ విలువలు ఉన్నాయి.

మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సంప్రదాయ విలువలు ఉన్నాయి. భోగి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. పాతదాన్ని విడిచిపెట్టి కొత్త జీవనశైలిని ఆహ్వానించే ఒక పవిత్ర ప్రక్రియగా భావిస్తారు. భోగి నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, ఇంటి ముందు ముగ్గులు వేయడం, భోగి మంటలు వేయడం, పిండి వంటలు చేయడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం వంటి ఆచారాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి.

భోగి పండుగ నాడు వేసే భోగి మంటలకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య కాలం. ఈ సమయంలో అగ్నిని సాక్షిగా చేసుకొని భోగి మంటలు వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఖాళీ ప్రదేశంలో ముగ్గు వేసి, దానిపై పాత చెక్క ముక్కలు, రావి, మేడి, మామిడి వంటి పవిత్ర వృక్షాల కర్రలు, ముఖ్యంగా ఆవు పిడకలను పేర్చి భోగి మంటను వెలిగిస్తారు.

అగ్నిని దైవంగా భావించే భారతీయ సంప్రదాయంలో భోగి మంటలో పసుపు, కుంకుమ, అక్షతలు వేయడం ద్వారా అగ్నిదేవునికి పూజ చేస్తారు. అనంతరం భోగి మంట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల గ్రహ దోషాలు, అపశకునాలు, పీడలు తొలగిపోతాయని విశ్వాసం.

భోగి మంట దగ్గర ఒక బిందె నీళ్లు పెట్టుకుని, మంట పూర్తిగా తగ్గిన తర్వాత ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని కుటుంబ సభ్యులంతా స్నానం చేయడం చాలా విశేషమైన ఆచారం. ఈ విధంగా స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మనసులోని దోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలా మందికి ఈ రహస్యం ఇప్పటికీ తెలియకపోవడం విశేషం.

ఇంటికి హరిదాసు వస్తే, భోగి మంట చుట్టూ తిరగమని కోరడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. అలాగే భోగి మంట పూర్తయిన తర్వాత దానిని నీటితో పూర్తిగా ఆర్పి, ఆ బూడిదను పారబోసేయకుండా నుదుటన బొట్టు కింద పెట్టుకోవడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు.

భోగి నాడు పీడను వదిలించుకునే ప్రత్యేక ఆచారాలు కూడా ఉన్నాయి. ఉదయం తలంటుకుని భోగి నీటితో స్నానం చేయాలి. ఐదేళ్లలోపు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం వల్ల వారికి ఉన్న పీడలు తొలగిపోతాయని నమ్మకం. ఇది పిల్లల ఆరోగ్యానికి, ఆయుష్షుకు శుభ సూచకంగా భావిస్తారు.

భోగి మంటను సామాన్యంగా చూడకూడదు. ఇది అగ్నిహోత్రం వంటిదే. ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి కావడంతో ఈ రోజు ఆలయానికి వెళ్లి గోదా కళ్యాణంలో పాల్గొనడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే భోగి నాడు నువ్వులతో చేసిన వంటకాలు తినడం, నువ్వులను దానంగా ఇవ్వడం వల్ల పితృదోష నివారణ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇంటి ముందు వేసే ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టడం భూమాతకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఆచారం వల్ల పంటలు బాగా పండాలని, కుటుంబంలో సుభిక్షం కలగాలని కోరుకుంటారు. ఈ విధంగా భోగి పండుగ మన జీవన విధానాన్ని శుద్ధి చేసుకునే ఒక పవిత్ర అవకాశం అని చెప్పవచ్చు.

ALSO READ: భోగి పండుగ వేళ ఏ రాశులకు శుభ ఫలితాలు ఎదురవుతాయో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button