Monday, March 9, 2026
Homeఆంధ్ర ప్రదేశ్తిరుమల భక్తి ఛానల్ కు కొత్త చైర్మన్...!

తిరుమల భక్తి ఛానల్ కు కొత్త చైర్మన్…!

  • రెండేళ్లుగా ఆ పోస్ట్ ఖాళీ

  • భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం

క్రైమ్ మిర్రర్, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే టీటీడీ నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కు సంబంధించిన ఒక వివాదం కూడా బయటకు వచ్చింది.

పరకామణి కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల పవిత్రతపై అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టిటిడి అధ్యక్షుడి మార్పు ఉంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే పనిలో పనిగా టీటీడీ భక్తి ఛానల్ అధ్యక్షుడి నియామకం చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ఈ పదవి ఖాళీగా ఉంది.

టీటీడీలో కీలకం..
టీటీడీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్ ది కీలక స్థానం. స్వామివారి పూజా కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటుంది. కోట్లాదిమంది భక్తులు వీక్షిస్తుంటారు. సాధారణ టీవీ చానల్స్ కు మించి వీక్షకులు ఉంటారు.

అందుకే 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం.. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పర్యవేక్షణకు ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావును ఎస్ వి బి సి చైర్మన్గా బాధ్యతలు అప్పగించింది. ఐదేళ్లపాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ను బాగానే నడిపి ప్రేక్షక ఆదరణ పొందేలా చేశారు రాఘవేంద్రరావు. ఎటువంటి వివాదాలు లేకుండా ఐదేళ్లపాటు బాగానే నడపగలిగారు.

తొలిసారిగా దర్శకేంద్రుడి బాధ్యతలు…
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాఘవేంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే ముందు టిడిపి ప్రభుత్వం తనను నియమించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించారు. అయితే వైసిపి ప్రభుత్వం సినీ పరిశ్రమకు చెందిన కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ ను ఎస్వీబీసీ చైర్మన్గా నియమించింది.

కానీ ఆయన లైంగిక పరమైన ఆరోపణలకు గురయ్యారు. దీంతో వైసిపి ప్రభుత్వం ఆయన పై వేటు వేసింది. సాయి కృష్ణ యచేంద్ర అనే మాజీ ఎమ్మెల్యేను ఆ పోస్టులో నియమించింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఏచేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ నియామకం మాత్రం జరగలేదు.

ఆశావహులు అధికం..
మరోవైపు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న బీఆర్ నాయుడు పై తాజాగా కొన్ని రకాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన మార్పు ఉంటుందన్న ప్రచారం నడిచింది. అదే జరిగితే ఎస్వీబీసీ చైర్మన్ పదవి భర్తీ చేస్తారని తెలుస్తోంది. బి ఆర్ నాయుడు స్వతహాగా టీవీ5 న్యూస్ ఛానల్ అధినేత. అందుకే ఎస్వీబీసీ ఛానల్ బాధ్యతలు కూడా ఆయనే చూసుకున్నారు.

అందుకే అప్పట్లో నియామకాలు జరపలేదు. అయితే ఇప్పుడు టీటీడీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తే మాత్రం.. కొత్త వ్యక్తి ఎస్ వి బి సి చైర్మన్ గా రావడం ఖాయం. అయితే సినీ పరిశ్రమ నుంచే చాలామంది ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి బాధ్యతలు ఎవరికి ఇస్తారో?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments