క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. జూన్ నాటికి రెండేళ్లు పూర్తి కానుంది. మరోవైపు రాజకీయంగా పట్టు బిగించాలని కూటమి భావిస్తోంది. బలం పుంజుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఈ పరిణామాల క్రమంలో రాజకీయాలు మారుతున్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదని కూటమి భావిస్తోంది. రాజకీయంగా మరింత బలపడాలని చూస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి సమర్ధులను క్యాబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తోంది. అదే టీం తో 2029 ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. వేసవిలో తప్పకుండా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కొత్తగా ఐదుగురు మంత్రివర్గంలో చేరనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఓ ఐదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి కూడా. శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.
మెగా బ్రదర్ నాగబాబుకు..
ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అది మెగా బ్రదర్ నాగబాబు కోసం అని ఇదివరకే సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజ్యసభ సమీకరణలో భాగంగా నాగబాబుకు ఛాన్స్ దక్కలేదు. దీంతో ఏపీ క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే గత మార్చిలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో నాగబాబుకు తప్పకుండా చాన్స్ లభిస్తుంది. అయితే ఇప్పుడు ఓ ఐదుగురికి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. రకరకాల సమీకరణలను తెరపైకి తెచ్చి.. కొందరు మంత్రులను మార్చనున్నారు. అయితే అలా మార్చే వారి పేర్లు తెలియదు కానీ.. కొత్తగా మంత్రులుగా తీసుకునే వారి పేర్లు మాత్రం బయటకు వచ్చాయి. అందులో డాక్టర్ బెందాళం అశోక్, కొణతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, మద్దిపాటి వెంకట రాజు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు ప్రచారం నడుస్తోంది.
హ్యాట్రిక్ విజయం..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు డాక్టర్ బెందాళం అశోక్. 2014లో తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో సైతం నిలిచారు. 2024లో ఏకపక్ష విజయం సాధించారు. 2019లో గెలిచిన అశోక్ ను ప్రలోభ పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగానో ప్రయత్నం చేసింది. కానీ పార్టీ పట్ల పూర్తి విధేయతతో ఉండేవారు అశోక్. 2024 ఎన్నికల్లో గెలిచిన ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా దక్కలేదు. మంత్రివర్గ విస్తరణలో మాత్రం తప్పకుండా పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది.
అత్యధిక మెజారిటీతో..
రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు పల్లా శ్రీనివాస్. మొన్నటి ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ పై 95 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అందుకే ఆయనకు టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు చంద్రబాబు. అత్యధిక మెజారిటీ దక్కించుకోవడంతో పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ వివిధ సమీకరణల్లో భాగంగా ఆయనకు అవకాశం చిక్కలేదు. అయితే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
సీనియర్ మోస్ట్ లీడర్..
అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కొణతాల రామకృష్ణ. సీనియర్ మోస్ట్ పొలిటిషియన్ గా ఆయనకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పని చేశారు. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయమ్మను పోటీ చేయించడంలో కొణతాల పాత్ర ఉంది. ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోవడంతో కొణతాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారిందని ప్రచారం నడిచింది. అటు తర్వాత కొద్ది రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు కొణతాల రామకృష్ణ. 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా జనసేనలో చేరి అనకాపల్లి నుంచి పోటీ చేశారు. గెలిచిన ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ వివిధ సమీకరణలో ఛాన్స్ రాలేదు. అందుకే విస్తరణలో మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది.
ప్రశాంతి రెడ్డికి ఛాన్స్..
మొన్నటి ఎన్నికల్లో నెల్లూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. దానికి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎన్నికల ముందు వరకు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. బలమైన శక్తిగా పనిచేశారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో గౌరవం దక్కకపోవడంతో ప్రభాకర్ రెడ్డి తన భార్య ప్రశాంతి రెడ్డితో కలిసి టిడిపిలో చేరారు. తనతో పాటు పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను టిడిపిలోకి తెచ్చారు. తాను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా.. ప్రశాంతి రెడ్డి కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇద్దరూ గెలిచారు. అయితే ఎవరికో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ సమీకరణల్లో ఛాన్స్ రాలేదు. అందుకే ఈసారి ప్రశాంతి రెడ్డికి అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది.
మద్దిపాటి వెంకట రాజుకు..
మరోవైపు మద్దిపాటి వెంకటరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గెలిచారు వెంకటరాజు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీ కోసం బలంగా పనిచేశారు. ఆయనకు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే మంత్రివర్గ విస్తరణలో మద్దిపాటి వెంకట రాజుకు మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది.
