
Modi-Putin Car Ride: ట్రంప్ టారిఫ్స్ వేళ సాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్ తో ప్రధాని మోడీ సమావేశం కావడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధినేత పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మోడీతో జరిగిన సంభాషణ గురించి పుతిన్ తాజాగా వెల్లడించారు. అదేమీ పెద్ద సీక్రెట్ కాదని చెప్పుకొచ్చారు.
అదేం పెద్ద సీక్రెట్ కాదు!
చైనా పర్యటన అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడారు. మోడీతో కారులో సంభాషణ గురించి ప్రస్తావించారు. అదేం పెద్ద సీక్రెట్ కాదన్నారు. అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చల గురించి మోడీకి వివరించినట్లు చెప్పుకొచ్చారు. అలస్కాలో ట్రంప్ తో కలిసి కారులో ప్రయాణించిన సమయంలో 30 సెకన్లు మాత్రమే మాట్లాడుకున్నట్లు చెప్పారు. బ్రోకెన్ ఇంగ్లీష్ లోనే తన సంభాషణ జరిగిందని వివరించారు. ట్రంప్ ఆరోగ్యంగా ఉండటం చూసి సంతోషంగా ఉన్నానని అతనితో చెప్పినట్లు పుతిన్ చెప్పుకొచ్చారు. పుతిన్ ఇటీవలే అలస్కా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో జరిగిన సంభాషణ గురించి ప్రధాని మోడీకి వివరించినట్లు పుతిన్ తాజాగా వెల్లడించారు.